ఖానాపూర్: ఎమ్మెల్యేగా ఎన్నికై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.. తాను వెయ్యి రోజుల్లో నియోజకవర్గానికి రూ.1000 కోట్లకుపైగా నిధులు తెచ్చానని తెలిపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వివిధ శాఖల ద్వారా నిధులు తెచ్చినట్లు ‘సాక్షి’కి వెల్లడించారు.
సాక్షి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమిటి?
ఎమ్మెల్యే: విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు, ఉపాధి అవకాశాలు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చాం. ఆదివాసీ, గిరిజనుల హక్కులను పరిరక్షించి వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పాం. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించడం, విద్యార్థులకు మెరుగైన విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం, రైతులకు అవసరమైన సహకారం అందించడం మా లక్ష్యం.
సాక్షి: ఇంకా నెరవేర్చాల్సినవి ఏమిటి?
ఎమ్మెల్యే: అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ఇప్పటికే మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. సాగునీటి రంగంలో 22 పనులకు రూ.22.81 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.17.14 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. పీఎం జన్‌మన్, ఇతర ప్రాజెక్టుల కింద పీవీటీజీ ప్రాంతాల్లో 20 పనులకు రూ.2.04 కోట్లు మంజూరయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేస్తాం.
సాక్షి: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది?
ఎమ్మెల్యే: మహిళలు, రైతులు, పేదలు, విద్యార్థులు, గిరిజనులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. గృహజ్యోతి ద్వారా రూ.1.70 కోట్లు, మహాలక్ష్మి ద్వారా రూ.2.50 కోట్ల మేర ప్రయోజనం నియోజకవర్గ ప్రజలకు లభించింది. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా కూడా 4,500 పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పిస్తున్నాం.
సాక్షి: ప్రజలకు మీరిచ్చే భరోసా ఏమిటి?
ఎమ్మెల్యే: రాబోయే రోజుల్లో మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయడంతోపాటు కొత్త పనులకు మరిన్ని నిధులు తీసుకువస్తాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, పోడు భూముల సమస్య పరిష్కారం, గిరిజనులకు అటవీశాఖ నుంచి ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను.


