1976 సెప్టెంబర్ 2న ప్రారంభమైన సింగరేణి ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ జ్ఞాపకార్థం ప్రత్యేక తపాలా కార్డు విడుదల 50 ఏళ్లగా కార్మికులు, వారి కుటుంబాల సేవలోనే రైలు
మంచిర్యాలఅర్బన్: రోజంతా భూగర్భ గనుల్లో నల్ల టి బొగ్గు దుమ్ముల్లో చెమటోడ్చి పనిచేసిన కార్మికులకు, తమ స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చి ఓదార్పునందించిన నేస్తం సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు. ఇనుప పట్టాలపై నడిచే యంత్రం కాదు.. వేలాది కార్మికుల కుటుంబాల సంతోషాలు, బాధ్యతలు, బంధాలను మోసుకెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ప్రైవేటు రవాణాతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణించే సౌలభ్యం ఉండటంతో దశాబ్దాలుగా కార్మికులకు ఊరటనిచ్చింది.
50 వసంతాలు..
సింగరేణి గని కార్మికులు, వారి కుటుంబాల కోసం సేవలందిస్తున్న సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి యాజమాన్యం కలిసి బొగ్గు గని కార్మికుల సౌకర్యార్థం 1976 సెప్టెంబర్ 2న ఈ రైలును ప్రారంభించారు. సిర్పూర్‌టౌన్ నుంచి భద్రాచలం రోడ్ వరకు దాదాపు 340 కిలోమీటర్ల దూరం బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, వ రంగల్, డోర్నకల్, కారేపల్లి మీదుగా రైలు పరుగులు తీస్తోంది. సింగరేణి బెల్ట్‌లోని బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రధాన బొగ్గు గని ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబాలు ఇతర ప్రాంతా లకు ప్రయాణించడానికి ఎంతో సులువుగా మారింది. సింగరేణి ఎక్స్‌ప్రెస్ మొదటి సర్వీసు ప్రారంభోత్సవ జ్ఞాపకార్థం ప్రత్యేక తపాలా కార్డు విడుదల చేసింది.
ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు..
గతంలో ఇది సాధారణ ప్యాసింజర్ రైలుగా నడిచేది. ప్రయాణికుల రద్దీ వేగం దృశ్యా ఎక్స్‌ప్రెస్ రైలుగా అప్‌గ్రేడ్ చేశారు. రైలు ప్రారంభ నాటి రోజుల్లో 10 నుంచి 12 వరకు ప్యాసింజర్ బోగీలు ఉండగా ప్రస్తుతం 16 నుంచి 18 వరకు బోగీలతో రవాణా సాగిస్తోంది. మొదట్లో భద్రాచలం రోడ్డు నుంచి బెల్లంపల్లి మధ్య ప్రారంభం కాగా తర్వాత ప్యాసింజర్ స్థాయిని తగ్గించి సిర్పూర్ టౌన్ వరకు పొడిగించారు. 2007 వరకు సింగరేణి ప్యాసింజర్ రైలు కాజీపేట్ జంక్షన్ వరకు వెళ్లి ఇంజన్ అమర్చుకుని మళ్లీ వెనక్కి సిర్పూర్ టౌన్ వైపు వెళ్లేది. కరోనా సమయంలో ఈ రైలును ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. రైలు ప్రారంభ సమయంలో ఎక్స్‌ప్రెస్ స్టాప్‌లు మాత్రమే ఉండేవి. తర్వాత ప్యాసింజర్‌గా మార్చి అన్ని స్టాప్‌లు ఇచ్చారు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్‌గా మార్చి కొన్నిస్టాప్‌లు తొలగించారు. కొత్తలో సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు స్టీమ్ ఇంజన్, తర్వాత డీజిల్ ఇంజన్, 1995 నుంచి పూర్తిగా విద్యుత్ ఇంజన్‌తో నడుస్తోంది.
మణుగూరు వరకు పొడగించాలి
సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్‌లో 10 గంటలు ఖాళీగా ఉంటోంది. మణుగూరు వరకు పొడగిస్తే సింగరేణి ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఎగువ మార్గంలో కొత్తగూడెం నుంచి బల్లార్షా మధ్య, దిగువ మార్గంలో సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్డు మధ్య రాకపోకలు సాగిస్తూ 50 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది.
– ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు


