ఆదిలాబాద్‌టౌన్: ఇన్‌స్ట్రాగామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం వివరాలు వెల్లడించారు. ఇచ్చోడకు చెందిన మొబైల్ షాపు యజమాని సయ్యద్ సమీర్ జూలై 25న చార్జర్లు, డిస్‌ప్లే, ఇతర యాక్సెసరీస్ కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో వెతుకుతుండగా ‘రాజ్ ఎల్‌ఈడీ ముంబై’ పేరుతో ఉన్న ఖాతా అతని దృష్టికి వచ్చింది. అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా తక్కువ ధరకు స్పేర్ పార్ట్స్ అందిస్తామని, ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా సరుకులు పంపిస్తామని చెప్పడంతో జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు పలు విడతల్లో నిందితుడు పంపించిన క్యూఆర్ కోడ్‌కు రూ.2.18 లక్షలు చెల్లించాడు. వాట్సాప్ ద్వారా కొరియర్ రశీదు పంపించి, ‘మజీసా ఎయిర్ ఎక్స్‌ప్రెస్’ ద్వారా సరుకులు వస్తాయని తెలిపాడు. రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అవుతోందంటూ బాధితుడిని మరింత నమ్మించాడు. ఆగస్టు 22న ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ‘మజీసా ఎయిర్ ఎక్స్‌ప్రెస్’ కార్యాలయం కోసం బాధితుడు వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించి 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుడు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో సుమారు 140 మంది వద్ద రూ.5.30 కోట్ల మేర మోసం చేసినట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష నగదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ నరేష్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


