నెన్నెల: అనుమానం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆమెను హత్య చేసిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం అచ్చులాపూర్‌కు చెందిన సబిత (35)కు నెన్నెల మండల కేంద్రానికి చెందిన తోట మల్లేశ్‌తో 2009లో వివాహమైంది. దంపతులకు పదోతరగతి చదువుతున్న కుమార్తె ప్రవస్తి, ఏడోతరగతి చదువుతున్న కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. భార్యపై అనుమానంతో మల్లేశ్ గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పట్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పలుమార్లు ప్రయత్నాలు జరిగినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో బుధవారం పిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న భార్యపై పదునైన ఆయుధంతో గొంతులో గుచ్చి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన పిల్లలు బెడ్‌పై తల్లి మృతదేహాన్ని చూసి రోధించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితునికోసం గాలిస్తున్నారు. మృతురాలి సోదరుడు పూదరి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసీపీ వివరించారు.


