ఉట్నూర్‌రూరల్: గుప్త నిధుల పేరుతో తవ్వకాలు చేపడుతున్న నలుగురు సభ్యులున్న ముఠాను అరె స్టు చేసినట్లు ఎస్సై గుంపుల విజయ్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ మండలం కొత్తగూడ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా జన్నారం వైపు నుంచి వస్తున్న కారులో నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారి సెల్‌ఫోన్లను పరిశీలించగా భూమిని తవ్వుతున్న వీడియోలు బయటపడ్డాయి. విచారణలో ఉట్నూర్ కోటలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి, తవ్వకాల వీడియోలు చూపిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఆయుర్వేద మందుల పేరుతోనూ అమాయకులను మోసం చేసేందుకు యత్నించినట్లు తేలింది. కారు, సెల్‌ఫోన్, ఆయుర్వేద సామగ్రి స్వాధీనం చేసుకుని నిందితులు కమెర కిషన్, దుర్గం లింగయ్య, దుర్గం ప్రవీణ్, దాసరి యసుబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.


