ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్టు

Sep 1 2026 1:31 AM | Updated on Sep 1 2026 1:31 AM

● నాలుగు బైక్‌లు, ఏడు సెల్‌ఫోన్లు, చోరీ సామగ్రి స్వాధీనం

భైంసా: రాత్రివేళల్లో ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠా సభ్యులను ముధోల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భైంసా పోలీసుస్టేషన్‌లో ఏఎస్పీ సాయికిరణ్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. భైంసా డివిజన్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో గత ఎనిమిది నెలల్లో నమోదైన 33 ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. వారి నుంచి 250 కిలోల రాగి తీగ, నాలుగు బైక్‌లు, ఏడు సెల్‌ఫోన్లు, ఎనిమిది పానాలు, కటింగ్‌ ప్లేయర్‌, దబ్బనం స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో విలువైన రాగి తీగను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ముధోల్‌ పరిధిలో 8, తానూర్‌లో 11, కుభీర్‌లో 4, బాసరలో 3, భైంసా టౌన్‌లో 3, భైంసా రూరల్‌లో 2, కుంటాలలో 2 కేసులు నమోదయ్యాయి. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ భైంసా పర్యవేక్షణలో ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీల ఛేదనకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేయడంతో ముఠా కదలికలపై నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.

మహారాష్ట్రకు చెందినవారే..

నిందితులను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, రత్నేల్లి ప్రాంతాలకు చెందిన పెడికే గణేశ్‌, పిట్లోల్ల పోశెట్టి, ఘోగరే దీపక్‌, గంటలవాడ్‌ సాయినాథ్‌, గజనంద్‌, నక్కలవాడ్‌ గణేష్‌ తదితరులుగా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించి న ముధోల్‌, బాసర, తానూరు పోలీసు అధికారులు , సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement