ఇప్పుడేం చేయాలి.. సర్‌? | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడేం చేయాలి.. సర్‌?

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

● నోటీసులు అందక.. ఏముందో తెలియక.. ● ఎలా సరిచేయాలో అర్థం కాక.. ● ఇబ్బందులు పడుతున్న ఓటర్లు ● పని భారమవుతోందంటున్న బీఎల్‌వోలు

నిర్మల్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ఎన్యూమరేషన్‌ విజయవంతంగా పూర్తిచేసిన జిల్లాలో నోటీసుల ప్రక్రియలో గందరగోళంగా మారింది. చాలామందికి నోటీసులు అందక, అందిన నోటీసుల్లో తప్పులు ఉండడం, ఎలా సరిచేయాలో తెలియకపోవడం, అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోనే పలు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఇప్పటికీ నోటీసులు అందక ఆందోళన నెలకొంది.

అందని నోటీసులు..

జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌ ప్రాంతంలోని పలు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఇప్పటికీ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులు చాలామందికి అందలేదు. ఓ పోలింగ్‌ కేంద్రం పరిధిలో బీఎల్‌వో అనారోగ్యం కారణంగా అందుబాటులో లేక ఎవరికీ నోటీసులు అందలేదు. వారికి సోమవారమే హియరింగ్‌ ఉన్నా.. నోటీసులు అందక కార్యాలయాల చుట్టూ తిరిగారు. చివరకు అర్బన్‌ తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఇలాగే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నోటీసులు ఇవ్వడం, చిరునామాల్లో మార్పులు ఉండటం, పంపిణీ ప్రక్రియలో సమన్వయం లేకపోవడం వంటి కారణాలతో కొందరికి సమాచారం చేరలేదని తెలుస్తోంది. దీంతో సర్‌ జాబితాలో తమ పేరు, వివరాల విషయంలో ఏం జరుగుతుందో తెలియక పలువురు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.

అవగాహన అంతంతే..!

ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ఎన్యూమరేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిన జిల్లా అధికారులు నోటీసులు, సవరణల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్యూరేషన్‌ ఎలా చేసుకోవాలో ప్రచారం చేసిన అధికారులు నోటీసులు వచ్చినవారు ఎలా సవరణలు చేసుకోవాలి, ఏయే ధ్రువపత్రాలు సమర్పించాలి అనే అవగాహన క్షేత్రస్థాయిలో కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నోటీసు వచ్చిన తర్వాత ఓటరు చేయాల్సిన ప్రక్రియ, అవసరమైన పత్రాలు, అభ్యంతరాలు లేదా మార్పుల కోసం దరఖాస్తు చేసే విధానం వంటి అంశాలను సులభంగా ప్రజలకు వివరించాల్సి ఉంది.

భారంగా భావిస్తున్న బీఎల్‌వోలు..

నోటీసులు అందని వారికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవడం, తప్పుల సవరణకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సర్‌ ప్రక్రియ తమకు భారమవుతోందని బీఎల్‌వోలు పేర్కొంటున్నారు. నోటీసులు ఇవ్వడం, సవరణలు చేయించడం తలకు మించిన భారంగా మారిందంటున్నారు. అదనంగా సిబ్బందితో ఓ టీమ్‌గా పూర్తిచేయించాలని కోరుతున్నారు.

ఏం చేయాలంటే..

ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌ ప్రక్రియలో అన్ని వివరాలు పక్కాగా ఉంటేనే ఓటు భద్రంగా ఉంటుంది. లేదంటే.. జాబితాలో నుంచి గల్లంతవుతుంది. అందుకే.. ప్రతీ ఓటరు తమ ఓటు ప్రస్తుత స్థితి ఏమనేది తెలుసుకోవాలి. నోటీసులు ఇంటికి రాకపోతే బీఎల్‌వో దగ్గరికి వెళ్లి పరిశీలించాలి. ఒకవేళ వస్తే.. ఆ నోటీసు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలి. ప్రధానంగా పేరు, చిరునామా, కుటుంబసభ్యుల వివరాలు తప్పుగా ఉంటాయి. తప్పులు ఉంటే సవరణ కోరాలి. ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలు జతచేయాలి. నోటీసులో విచారణ(హియరింగ్‌)కు హాజరు అవసరమైతే తప్పనిసరిగా హాజరు కావాలి. చివరకు తుదిజాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి.

తప్పులుంటే ఎలా..?

నోటీసులు అందిన వారిలోనూ కొందరికి కొత్త సమస్య ఎదురవుతోంది. పేరులో అక్షరదోషాలు, వయసు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాల్లో పొరపాట్లు ఉంటేనే నోటీసు వస్తుంది. అయితే వాటిని ఎలా సరిచేయాలి? ఎవరిని సంప్రదించాలి? ఏ పత్రాలు సమర్పించాలి? అనే దానిపై స్పష్టత లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ప్రక్రియపై కొంత అవగాహన ఉన్నవారు మాత్రమే నోటీసులలో సవరణలను చేయించుకుంటున్నారు. అందులో ఇచ్చిన తేదీ ప్రకారం హియరింగ్‌కు వెళ్లి మార్చుకుంటున్నారు. వృద్ధులు, అవగాహన లేనివారు నోటీసులకు ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement