లక్ష్మణచాంద: పీపుల్స్ నెస్ట్ టాలెంట్ టెస్ట్‌కు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ సౌజన్యంతో అన్ని జిల్లాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5, 6వ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు ఇందులో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. 6, 7 తరగతుల కోసం నిర్వహించే ఈ పరీక్షలో ఎంపికై న విద్యార్థులకు వసతితోపాటు భోజనం, విద్య ఉచితంగా అందించడం జరుగుతుందని వివరించారు. మండలంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 8 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 15న నిర్మల్‌లో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇందులో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజునాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


