కోటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కోటి కష్టాలు

Mar 7 2026 7:23 AM | Updated on Mar 7 2026 7:23 AM

విపరీతంగా వానర సంతతి ఎవరికీ పట్టని ‘ప్రయోగం’ పరేషానవుతున్న జనాలు పట్టణాల్లో కట్టడికి ప్రయత్నాలు గ్రామాల్లో వినూత్న చర్యలు

కోతుల కట్టడికి

నిర్మల్‌: ‘అరె.. ఇవేం కోతులు పొద్దున లేసిన్నుంచి పరేషాన్‌ చేస్తున్నయ్‌. బయటకు అడుగు పెట్టనిస్తలేవు. పిల్లలను బడికి పంపుదామంటే మందకు మంద వాకిట్లనే కూసున్నయ్‌. ఏమన్నందామంటే మీదికస్తున్నయ్‌. వీటిని ఏంచేసుడిగ..’ జిల్లాలో ఇదీ పరిస్థితి. ఇది ఒక్క జిల్లాకేంద్రమో.. ఇంకో ఊరిదో కాదు. జిల్లావ్యాప్తంగా అన్ని ఊళ్లల్లో ఇప్పుడు కోతులతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. చెప్పుకోవడానికి చిన్న ముచ్చటనే కానీ.. వీటితో ప్రధానంగా పల్లెల్లో రైతులు పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. వీటి బాధ భరించలేక పంటచేళ్లల్లో చుట్టూ ఉన్న చెట్లను నరుక్కున్నారు. అంతేకాదు.. వాటిని తరిమికొట్టేందుకు కొండెంగ, ఎలుగుబంటి, చింపా జీ వేషధారణలో వాటివెంట పరుగులు తీయాల్సిన దుస్థితి ఉంది. ఇన్ని చేస్తున్నా.. వానరాల కట్టడి సాధ్యం కావడం లేదని పలువురు వాపోతున్నారు.

పెరుగుతూనే ఉన్న సంతతి..

వానరాల జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. దాదాపు 25–30 ఏళ్లు జీవించే ఆడకోతి కేవలం మూడేళ్ల వయసు నుంచే గర్భం దాలుస్తుంది. తన జీవితకాలంలో దాదాపు 20–22 పిల్లలు కంటుంది. ఇలా వాటి సంతతి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లోనే పరిమితమైన కోతులు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ గుంపులుగా ఉంటున్నాయి. ఆహారం కోసం జనావాసాలు, పంటచేళ్లపై ఆధారపడుతున్నాయి. తిండి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరు అడ్డుకున్నా, తమను కొట్టేందుకు వచ్చినా విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నాయి.

ప్రయోగానికి స్పందనేదీ..?

రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నిర్మల్‌ జిల్లాకేంద్రం సమీపంలోని గండిరామన్న హరితవవనంలో 2020 డిసెంబర్‌లో ‘మంకీ రిహాబిలిటేషన్‌ సెంటర్‌’ ఏర్పాటు చేశారు. ఇందులో వానరాలకు ట్యూబెక్టమీ, వేసెక్టమీ చేసి, వాటి సంతతి క్రమంగా తగ్గించే ప్రక్రియను ప్రారంభించారు. కానీ.. ఇక్కడికి కోతులను తీసుకురావడమే అసలు సమస్య. కొన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు మాత్రమే కోతులను పట్టి తీసుకొస్తున్నాయి. ఈ ప్రయోగం కొంతమేర ఫలితమిచ్చేలా ఉన్నా.. ప్రస్తుత సర్కారు మాత్రం దీనిపై దృష్టిపెట్టడం లేదు. ఇటీవల కొలువుదీరిన నిర్మల్‌ పుర పాలకవర్గం త్వరలోనే కోతుల కట్టడికి చర్యలు తీసుకుంటామని చెప్పింది. గతంలో మాదిరి వాటిని పట్టుకుని దూరంగా అడవుల్లో వదిలి పెడతామని పేర్కొన్నారు.

వేషం వేయాల్సిందే..

ఈ చిత్రంలో ఇద్దరు ఎలుగుబంటి, చింపాజీలను పోలినట్లున్న వేషం వేసుకున్నారు. వీరు కూడా కోతులను తరమడానికే ఇలా తిప్పలు పడుతున్నారు. నిర్మల్‌రూరల్‌ మండలం న్యూపోచంపాడ్‌లో సర్పంచ్‌ పద్మశ్రీనివాస్‌ కోతుల నివారణకు ఇలా గ్రామస్తులతో వేషం వేయించి కట్టడికి ప్రయత్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement