అన్నా.. ఓటుకు రావాలె | - | Sakshi
Sakshi News home page

అన్నా.. ఓటుకు రావాలె

Feb 10 2026 8:05 AM | Updated on Feb 10 2026 8:05 AM

అన్నా.. ఓటుకు రావాలె

అన్నా.. ఓటుకు రావాలె

నిర్మల్‌చైన్‌గేట్‌: ‘అన్నా.. నేను ఫలానా వ్యక్తిని.. మన కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నా. ఈ నెల 11న మీరు, మీ కుటుంబ సభ్యులు ఓటుకు రావాలె.. నాకే ఓటేసి గెలిపించండి. రానుపోను చార్జీలు పంపుతున్న.. వచ్చాక మిగతావి చూసుకుంటా.’ నిర్మల్‌లో ఓ అభ్యర్థి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లతో ఫోన్‌లో అన్న మాటలివీ. ప్రచార పర్వం ముగియడంతో వలస ఓటర్లను పోలింగ్‌ రోజు రప్పించేందుకు అభ్యర్థులంతా పాట్లు పడుతున్నారు. ఓటరు జాబితాలు పరిశీలిస్తూ ఎవరిని ప్రభావితం చేస్తే ఓట్లు పడతాయనే అంశాలపై కుస్తీ పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి సంబంధించిన ఓట్లు వేయించాలని ప్రాధేయ పడుతున్నారు.

యువత, విద్యార్థులే అధికం..

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, వ్యాపారులు ఎక్కువగా హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. యువకులు, విద్యార్థులే అధికంగా ఉంటారు. జిల్లాల నుంచి ఎక్కువగా హైదరాబాద్‌, ముంబైకి కార్మికులు వలస వెళ్తుంటారు. వారికి ఫోన్లు చేసి పోలింగ్‌ రోజు వచ్చి వెళ్లమని అభ్యర్థులు ప్రాధేయపడుతున్నారు. రవాణా సదుపాయం కల్పిస్తామని లేకుంటే దారి ఖర్చులు ఇస్తామని పేర్కొంటున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లను తీసుకుని సిద్ధంగా ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కూలీలుగా స్థిరపడ్డవారికి కూలి డబ్బులు సైతం ఇస్తున్నారు. ఉద్యోగులను సెలవు పెట్టి రావాలని కోరుతున్నారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో 1,67,015 మంది ఓటర్లుండగా అందులో 8 వేల నుంచి 10 వేల వరకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారే ఉన్నారు. ఒక్కొక్క వార్డులో 80 నుంచి 100 వరకు అలాంటి వారు ఉంటారు. ఆయా వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఇదే తరహాలో వలస ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement