● ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన పార్టీలు ● చివరి
హోరెత్తిన ప్రచారం
నిర్మల్: మున్సిపోల్స్‌లో కీలకమైన ప్రచారపర్వం ముగిసింది. మూడు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలతోపాటు పాటు స్వతంత్ర, రెబల్ అభ్యర్థులూ చివరిరోజైన సోమవారం ప్రచారం హోరెత్తించారు. వార్డుల్లో ఏ ఇంటినీ వదలకుండా మరోసారి కలియదిరిగారు. రెండు చేతులెత్తి దండం పెడుతూ ‘దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి..’ అంటూ ఓట్లు అభ్యర్థించారు. ఉదయం 8 గంటల నుంచే ప్రచారం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించారు. రోజుంతా నిమిషం వృథా చేయకుండా ప్రజల్లో తిరిగారు.
ప్రధాన పార్టీలన్నీ..
మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడుగా వ్యవహరించాయి. చివరిరోజు జిల్లాకేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి అభ్యర్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి అప్పాల కావ్య, గణేశ్‌చక్రవర్తి రోజంతా వార్డుల్లో ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ వేర్వేరుగా వార్డుల్లో ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ తరఫున బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పోటీ చేస్తున్న ప్రతీవార్డులో ఒకటికి రెండుసార్లు ఓటర్లను కలిసి అభ్యర్థించారు.
అంతా సైలెంట్..
పోలింగ్‌కు ఒకరోజు ముందే ప్రచారం నిలిపివేశారు. ఈనెల 3 నుంచి చెవుల్లో ఇళ్లు కట్టుకున్నట్లు వినిపించిన పాటలు, మైకులు, ప్రచారాలన్నీ మూగబోయాయి. క్షణం తీరిక లేకుండా తిరిగిన ప్రచార రథాలన్నీ కార్యాలయాలకు వెళ్లిపోయాయి. ఒక్కసారిగా నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు పట్టణాలూ సైలెంట్‌గా మారిపోయాయి.
● ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన పార్టీలు ● చివరి


