ముక్కుతున్న దొడ్డు బియ్యం..!
భైంసాటౌన్: ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డు దారులకు గతేడాది ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అంతకుముందు యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున దొడ్డుబియ్యం అందించేది. అయితే, చాలామంది దొడ్డు బియ్యం తినకుండా విక్రయించుకునేవారు. దీంతో బియ్యం రీసైక్లింగ్ అయ్యేది. ఇది గుర్తించిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘పేదోడి కంచంలో సన్న బువ్వ’ పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తోంది. దొడ్డు బియ్యం పంపిణీ నిలిచిపోవడంతో, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో 364.643 మెట్రిక్ టన్నులు, ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లో 4338.431 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. దాదాపు పది నెలలకుపైగా బియ్యం సంచులు గోదాముల్లో నిల్వ ఉండడంతో ముక్కి పోయి బూజు పడుతున్నాయి. ప్రభుత్వం టెండర్ నిర్వహించేందుకు యత్నిస్తోందని, ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్ తెలిపారు.


