‘మోడల్’ ఠాణాకు మోక్షమెప్పుడో!
లక్ష్మణచాంద: మండల కేంద్రంలో 2017లో ప్రారంభమైన మోడల్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం ప్రారంభించి ఏడేళ్లయినా పూర్తి కాలేదు. పురాతన భవనంలో ఇబ్బందులు పడుతూ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నిర్మాణం నెమ్మదిగా కొనసాగుతోంది. పాత భవనం దెబ్బతినడంతో పోలీసులు కష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో 2017లో అప్పటి ప్రభుత్వం రూ.72 లక్షలతో అన్ని సౌకర్యాలతో కూడిన నూతన భవనం మంజూరు చేసింది. మార్చి 8న పనులు ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక సౌకర్యాలతో ప్లాన్..
కొత్త భవనంలో ఎస్సై గది, పోలీసుల విశ్రాంతి గదులు, మహిళా పోలీసులకు ప్రత్యేక గది, ఫిర్యాదు హాల్, రిసెప్షన్, రికార్డు గది, ఇంటర్నెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కిటికీలు, విద్యుత్, డోర్లు, నీటి సౌకర్యాలు, పెయింటింగ్ పనులు ఇంకా పూర్తికాలేదు.
నిధుల విడుదలలో జాప్యం..
భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. పాములు వచ్చే పాత భవనంలో భయం భయంగా విధులు నిర్వహిస్తున్నామని పేర్కొంటున్నారు. ఉన్నతాఽ దికారులు త్వరగా స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. నూతన భవనం పూర్తయితే ఇబ్బందులు తొలగుతాయని పేర్కొంటున్నారు.


