పది పరీక్షలకు 78 రోజులే!
లక్ష్మణచాంద: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి 90% సిలబస్ పూర్తయింది. గ్రామపంచాయతీ ఎన్నికల విధులతో ఉపాధ్యాయులు 15 రోజులు పాఠశాలలకు దూరంగా ఉండటంతో మిగిలిన 10% పెండింగ్‌గా ఉంది. వచ్చే మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కలెక్టర్ సమీక్ష..
రెండు రోజుల క్రితం కలెక్టర్ అభిలాష అభినవ్, డీఈవో భోజన్న, మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల కారణంగా సిలబస్ పూర్తి కాలేదని తెలిపారు. దీంతో జనవరి 10లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సిలబస్ పూర్తి తర్వాత అభ్యాస దీపికలు, వారాంత పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
6,603 మంది విద్యార్థులు..
నిర్మల్ జిల్లాలో 168 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6,603 మంది 10వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్ర త్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. డిసెంబర్ చి వరికి పూర్తి సిలబస్ లక్ష్యంగా పని కొనసాగుతోంది.
సాధనతోనే మేలు....
1. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు తమలో ఉన్న భయాన్ని వీడి, ఒత్తిడికి లోను కా కుండా గతంలోని మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయడం వల్ల మేలు జరుగుతుందని విషయ నిపుణులు ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
2. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఇంటి వద్ద టీవీలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
3. ఈరోజు చదవాల్సిన పాఠ్యాంశాలను అదే రోజు చదువుకోవాలని ఉపాధ్యాయులు సూచించిన సూచనల మేరకు సన్నద్ధం కావాలి.
4. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
జిల్లా సమాచారం...
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 168
మొత్తం పదో తరగతి విద్యార్థులు 6,603


