పాడి రైతులకు తోడ్పాటు
కుంటాల: పంటల్లా కాకుండా, పాడి పరిశ్రమ రైతులకు నిరంతర ఆదాయాన్ని అందిస్తోంది. భూమి లే ని కుటుంబాలకు కూడా ఇది ప్రధాన ఆధారంగా మారింది. ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టాయి. ఈ ప్రయత్నాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.
బల్క్ మిల్క్ పాయింట్..
తెలంగాణ పాడి పరిశ్రమ సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని కల్లూరులో రూర్బన్ నిధులతో రూ.40 లక్షలు ఖర్చుపెట్టి బల్క్ మిల్క్ కూలింగ్ పాయింట్‌ను ఇటీవల ప్రారంభించారు. భైంసా, లోకేశ్వరం, కుంటాల మండలాల నుంచి పాలు సేకరించి ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఈ సౌకర్యంతో రైతులకు దూరభారం తగ్గుతుంది.
పాల సేకరణ కేంద్రాల విస్తరణ
మండలంలో 12 పాల సేకరణ కేంద్రాలను ఏర్పా టు చేసి, వాటి నిర్వహణకు పాల మిత్రులను నియమించారు. గేదె పాలకు వెన్న శాతం బట్టి లీటర్‌కు రూ.42 నుంచి రూ.80 వరకు, ఆవు పాలకు రూ.36 నుంచి రూ.42 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రతీరోజు సుమారు 2 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. రైతుల ఖాతాల్లో 15 రోజులకు ఒకసారి ఆన్‌లైన్‌లో డబ్బులు జమ చేస్తున్నారు.
రోజువారీ ఆదాయం..
పాల ఉత్పత్తి రైతులకు రోజువారీ ఆదాయంగా మారింది. వివిధ గ్రామాల్లో రైతుల సౌకర్యార్థం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాం. 15 రోజులకోసారి రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నాం.
– డాక్టర్ నందకుమారి,
డిప్యూటీ డైరెక్టర్, నిర్మల్, ఆదిలాబాద్


