వీధి వ్యాపారులకు మరో వరం..!
భైంసాటౌన్: పట్టణాల్లో వీధి వ్యాపారులకు చిన్నపాటి రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగానే తొలుత రూ.10 వేల రుణం మొదలుకుని, రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించింది. దీంతో చాలామంది వీధి వ్యాపారులు ఫైనాన్స్ వ్యాపారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధ తప్పింది. అలాగే స్వల్ప వడ్డీ, సకాలంలో రుణం చెల్లిస్తే, తిరిగి మరింత రుణం పెంచి అందించారు. ఫలితంగా వీధి వ్యాపారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరింది.
ఈసారి రూ.15 వేలు...
తాజాగా పీఎం స్వనిధి కింద లోక కల్యాణ్ మేళా పథకం ప్రవేశపెట్టింది. పథకం పాతదే అయినా.. రుణ మొత్తం రూ.5 వేలు పెంచడంతోపాటు నూతనంగా మరింత మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించాలని నిర్ణయించింది. ఈసారి కొత్తగా వీధి వ్యాపారులకు తొలుత యూనిట్‌కు రూ.15 వేలు అందించనున్నారు. గతంలో రూ.10 వేలు, రూ.20 వేలు పొంది సక్రమంగా చెల్లించిన వారికి రూ.25, రూ.50 వేలు అందించనున్నారు.
ఐదేళ్లలో 3,500 యూనిట్లు లక్ష్యం..
పీఎం స్వనిధి కింద ఈసారి జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో కొత్తగా 701 యూనిట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి 2029–30 వరకు ఐదేళ్లలో 3,506 మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులకు రూ.15 వేల రుణం అందిస్తున్నాం. అర్హులైన వీధి వ్యాపారులు ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా, ఇతర వివరాలతో మున్సిపల్ కార్యాలయంలో మెప్మా విభాగంలో సంప్రదించాలి.


