కంది.. పోయింది
ఈ చిత్రంలోని రైతు పేరు జరోల్ల గంగాధర్. తానూరు మండలం బోరిగాంకు చెందిన గంగాధర్.. తనకున్న నాలుగు ఎకరాల్లో వానాకాలం సోయా సాగుచేశాడు. అంతరపంటగా కంది వేశాడు. మొదట పంట ఆశాజనకంగా కనిపించింది. పుత, కాత దశకు వచ్చేసరికి తెగుళ్లు కారణంగా పంట నిలువుగా ఎండిపోయింది. మరోవైపు అటవీ జంతువుల బెడదతో ఉన్న పంట చేతికి అందకుండా పోయింది. నాలుగు ఎకరాల్లో కనీసం మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తానూరు: ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి, సోయా పంటలు కోల్పోయిన రైతులు అంతర పంటగా వేసిన కందిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏపుగా పెరిగిన పంట ఎండు తెగుళ్లు (ప్యూజేరియం), క్రిమికీటకాలు పూత దశలో సోకి 50 శాతం పంట నిలువుగా ఎండిపోయింది. అడవి జంతువుల దాడులతో చేతికొచ్చిన దిగుబడి కూడా పోయింది.
9 వేల ఎకరాల్లో సాగు..
జిల్లా వ్యాప్తంగా 9 వేల ఎకరాల్లో పత్తి, సోయాలో అంతరపంటగా కంది వేశారు. భైంసా డివిజన్‌లో ఎక్కువగా సాగు జరిగింది. ఒక ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల ఖర్చు చేశారు. సాధారణ ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి రావాలని, తెగుళ్లు, వన్యప్రాణుల కారణంగా 1 నుంచి 2 క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు ధర లేక..
గతేడాది క్వింటాల్‌కు రూ.7,500 మద్దతు ధర, ప్రైవేటు మార్కెట్‌లో రూ.8 వేల వరకు లభించాయి. ఈసారి మాత్రం రూ.7,500 కే పరిమితం కావడంతో సాగుకు చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. క్వింటాల్‌కు రూ.9 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
తెగుళ్లతో పంట ఎండిపోయింది
ఈ ఏడాది తొలుత కంది పంట బాగానే ఉంది. పూత, కాత దశలో ప్యూజేరియం ఎండు తెగులు సోకింది. పంట ఎక్కడికక్కడ ఎండిపోయింది. పగలు ఎండ, రాత్రి చలి తీవ్రత కారణంగా కూడా తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంది. తానూరు మండలంలో పంట నష్టం అధికంగా ఉంది.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి
కంది.. పోయింది


