
క్రీడాకారులే నిర్ణేతలుగా..
ఆదిలాబాద్: 19 ఏళ్ల వయస్సులో క్రీడల్లో రాష్ట్రస్థాయి వేదికల్లో పతకాలు సాధిస్తే వారి గురించి గొప్పగా చెబుతుంటాం. డిగ్రీ స్థాయిలో క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరచుకుని సత్తా చాటితే వారికి గొప్ప భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తాం. అయితే ఈ క్రీడాకారులు మాత్రం నైపుణ్యాలను అలవర్చుకోవడమే కాకుండా ఆ క్రీడపై పట్టు సాధించి అతి చిన్న వయస్సులోనే న్యాయ నిర్ణేతలుగా ఎంపిక కావడం విశేషం. మహబూబ్‌నగర్ వేదికగా నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వారు రిఫరీలుగా వ్యవహరించనున్నారు. టీనేజీలోనే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ రెఫరీలుగా ఎంపికై న ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులపై కథనం.
జంప్స్ రెఫరీగా అనిల్
ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం మంజరామ్ తండాకు చెందిన అజాడే శారదాబాయి–గురుదయాల్ సింగ్ దంపతుల కుమారుడు అనిల్ ప్రస్తుతం జిల్లా కేంద్రంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు స్టీపుల్ చేజ్, హ్యామర్ త్రోలో కాంస్య పతకాలతో మెరిశాడు. ట్రిపుల్ జంప్‌లో రజత పతకంతో సత్తా చాటాడు. మేలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిస్టిక్ర్ట్ టెక్నికల్ అఫీషియల్ కోర్సులో అర్హత సాధించాడు. తాజాగా మహబూబ్‌నగర్ వేదికగా నిర్వహించనున్న 11వ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంపు ఈవెంట్‌లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నాడు.