
ఘనంగా జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) బాసరలో ఫాదర్ ఆఫ్ లైబ్రేరియన్షిప్‌గా ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ ఎస్‌ఆర్.రంగనాథన్ 133వ జయంతి పురస్కరించుకుని జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ లైబ్రరీ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్ హాజరయ్యారు. ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సమాచారం పొందే మార్గాలు బహుముఖంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ, గ్రంథాలయాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదన్నారు. పుస్తకాల విలువ శాశ్వతంగా నిలిచి ఉంటుందని తెలిపారు. విశ్వవిద్యాలయ డిజిటల్ లైబ్రరీ సౌకర్యాలను విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు విస్తృతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. లైబ్రరీ అధికారి డాక్టర్ కె.అరుణజ్యోతి మాట్లాడుతూ, పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పుస్తకాలు కేవలం విజ్ఞాన సముపార్జనకు మూలం మాత్రమే కాక, మనలో ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయన్నారు. భాషా నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. సృజనాత్మకతను అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్ ఎస్‌ఆర్.రంగనాథన్ లైబ్రేరియన్షిప్ రంగంలో చేసిన అమూల్యమైన కృషిని స్మరించారు. కార్యక్రమంలో సిచ్చింది అర్చన, శైలజ, ఓరియంటేషన్ కోఆర్డినేటర్, లైబ్రరీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పుస్తక ప్రదర్శనను అతిథులు తిలకించారు.