
వరద సహాయ చర్యలకు రూ.కోటి నిధులు
నిర్మల్‌చైన్‌గేట్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద సహాయక చర్యలకు ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రతీ జిల్లాకు రూ.కోటి విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయం నుంచి కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రితోపాటు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లో వర్షాల ప్రభావం, లోతట్టు ప్రాంతాల పరిస్థితి, వరద ముప్పు, అవసరమైన రక్షణ చర్యలు, సహాయక బృందాల మోహరింపు, కంట్రోల్ రూంల ఏర్పాటు వంటి అంశాలపై సూచనలు చేశారు. సహాయక చర్యల పర్యవేక్షించేందుకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
ముందస్తు చర్యలు చేపట్టాం..
అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కడెం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో స్థితిని ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నీటి మట్టం పెరిగిన సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాల వారీగా తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 15 నుంచి 21 వరకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితులు, తక్షణ సహాయం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు 9100577132 నంబర్‌కు సమాచారాన్ని అందించవచ్చన్నారు. ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ సంకేత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.