
అధిక తేమ పంటలకు చేటు
చెన్నూర్‌రూరల్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంటచేలల్లో నీరు నిలిచింది. నీరు ఎక్కువైతే తేమ ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లనుంది. అధిక తేమతో పంటలు నష్టపోకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసా ద్ సూచిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... వర్షాలకు పత్తి చేనులో నీరు నిలిస్తే వెంటనే కాలువలు తీసి నీటిని బయటకు పంపించాలి. వర్షాలు తగ్గిన వెంటనే భూమిలో తేమను తగ్గించు కోవడానికి అంతర సేద్యం చేయాలి. బురద పదనులో ఎకరాకు 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అలాగే ఎకరానికి సీ ఓసీ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకరోజు తర్వాత కిలో స్వర్ణపాల్‌ను 150 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. పంటను వేరుకుళ్లు తెగులు ఆశిస్తే 3 గ్రాముల ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్‌ను లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో తడపాలి.
మొక్కజొన్న
అధిక తేమను తట్టుకోలేదు. సాధ్యమైనంత త్వరగా అంతరకృషి చేసుకోవాలి. ఎకరాకు 25 కిలోల యూ రియా, 10 కిలోల పొటాష్ ఎరువును మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. కాండం తొలిచే పురుగు ఉంటే కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి 3 కిలోలు ఆకు సుడుల్లో వేయాలి. పెసర, మినుము పైర్లకు అధిక తేమతో పేనుబంక, లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మిరప పంట
మిరప చేనులో నీరు నిలిస్తే వెంటనే నీటిని కాలు వల ద్వారా తొలగించాలి. నారుకుళ్లు తెగులు ఆశిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు గ్రాముల రిడోమిల్ లీటరు నీటికి కలిపి వారంలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అధిక తేమ నుంచి పంటలను కాపాడుకోవచ్చు.