జిల్లాలో రోజంతా కురిసిన వర్షం ప్రాజెక్టులకు పోటెత్తిన వరద కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టుల గేట్టు ఎత్తివేత ‘కడెం’ వరదలో ఒకరి గల్లంతు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నిర్మల్: జిల్లాపై వరుణుడు ఎట్టకేలకు కరుణి చూపించాడు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు ఎగువన మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో జిల్లాలోని మూడు ప్రధాన ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. ఇది కదా.. వానకాలమంటే అన్నట్లుగా రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. తానూరు, కుభీర్ మండలాలు మినహా అన్ని మండలాల్లో 20 మి.మీ. పైనే వర్షపాతం నమోదైంది. అధికంగా పెంబి, కుంటాల, లోకేశ్వరం మండలాల్లో 40 మి.మీ.పైనే కురిసింది. జిల్లాలో వానలకు తోడు ఎగువన మహారాష్ట్ర, ఆదిలాబాద్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు ఉండటంతో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. కడెం మొత్తం 18 గేట్లు ఎత్తగా, స్వర్ణ ఆరు గేట్లకుగాను ఐదు, గడ్డెన్నవాగు ప్రాజెక్టు 8 గేట్లకు గాను ఐదింటిని ఎత్తారు. పలు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నిర్మల్–కడెం రహదారిపై పలుచోట్ల చెట్లు కూలడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగడంతో గంగాపూర్, అల్లంపల్లి, ఇస్లాంపూర్, గండిగోపాల్‌పూర్ తదితర ఊళ్లకు రాకపోకలు నిలిచాయి. కడెం ప్రాజెక్టు దిగువన గంగాధర్ అనే వ్యక్తి గల్లంతు కావడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చేపడుతున్నాయి.
అప్రమత్తంగా అధికారులు..
భారీ వర్షాలకు తోడు, ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉంటోంది. కలెక్టర్ అభిలాషఅభినవ్ కడెం, స్వర్ణ ప్రాజెక్టులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు వరద సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ జానకీషర్మిల సిద్దాపూర్–జీఎన్‌ఆర్ కాలనీ వద్ద స్వర్ణనది ప్రవాహాన్ని పరిశీలించారు. కడెం ప్రాజెక్టు వద్ద శివంగి టీమ్‌ను అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు జిల్లా ప్రజలకు ముందస్తుజాగ్రత్త హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు.
వాన జోరు.. వరద హోరు..
వాన జోరు.. వరద హోరు..