
విశ్వవిద్యాలయ పోరాటం!
జ్ఞానసరస్వతీ వర్సిటీ సాధన సమితి ఆవిర్భావం కన్వీనర్‌గా ఎంసీ లింగన్న.. 40మంది కోకన్వీనర్ల ఎన్నిక ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన క్షేత్రస్థాయికీ చేరేలా ప్రణాళిక ‘సాక్షి’ కథనాలతో కదలిక
నిర్మల్: జిల్లాలో ‘జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయం’ ఏర్పాటు డిమాండ్ ఉద్యమ దశకు చేరుకుంది. ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు, ‘చేద్దాం విద్యావిప్లవం–సాధిద్దాం విశ్వవిద్యాలయం’ నినాదంతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశాలు ఈ ఉద్యమానికి ఊతమిచ్చాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో జరిగిన సమావేశంలో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు ‘జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి’ని ప్రకటించారు. ఈ సమితి కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమకారుడు, పెన్షనర్స్ సంఘం జాతీయ కార్యదర్శి ఎంసీ లింగన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు 40 మంది కో–కన్వీనర్‌లు, నలుగురు సీనియర్‌లతో కూడిన అడ్వైజరీ కమిటీ ఎంపిక చేయబడ్డారు.
సాధన సమితి ఏర్పాటు
కాకతీయ విశ్వవిద్యాలయం జిల్లా కేంద్రంలోని పీజీ సెంటర్‌పై సవతి ప్రేమ చూపిస్తూ కొత్త కోర్సులను ప్రవేశపెట్టకపోగా, ఉన్న కోర్సులను కూడా ఎత్తేస్తోంది. తెలంగాణ విశ్వవిద్యాలయం కనీసం అఫిలియేషన్‌కు అవకాశం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ‘జ్ఞానసరస్వతీ’ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా తెరపైకి వ చ్చింది. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా వి ద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయ, ఉద్యోగ, స్వచ్ఛంద సంఘాల నేతలతో సాధన సమితి ఏర్పడింది. కన్వీనర్‌గా ఎంసీ లింగన్నతోపాటు, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మల్లారెడ్డి, జల్ద వెంకటరమణ, పత్తి శివప్రసాద్, టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి విజయ్‌కుమార్‌లను అడ్వైజరీ కమిటీగా ఎన్నుకున్నారు. 2009 నుంచి విశ్వవిద్యాలయం కోసం ప్రయత్నిస్తున్న నంగె శ్రీనివాస్, డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, డాక్టర్ కృష్ణంరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవికుమార్, కట్కం మురళీ, అర్చన, విద్యావంతులు జుట్టు చంద్రశేఖర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాసం శ్రీధర్‌తోపాటు 40 మంది కో–కన్వీనర్‌లుగా ఎన్నికయ్యారు.
ముందడుగు వేస్తున్న ఉద్యమం..
జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయం కోసం నిర్మల్ జిల్లాలో ఏర్పడిన ఈ ఉద్యమం, విద్యావంతులు, మేధావుల సమష్టి కృషితో బలోపేతమవుతోంది. రాజకీయ జోక్యం లేకుండా, ప్రజల మద్దతుతో ఈ ఉద్యమం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తరించే అవకాశం ఉంది.
ప్రతిఒక్కరూ కలిసిరావాలి..
నిర్మల్ కేంద్రంగా జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నది న్యాయమైన కోరిక. నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు అవసరమిది. యూనివర్సిటీ సాఽధించేదాకా తెలంగాణ తరహాలో ఉద్యమిస్తాం. ఈ ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. – ఎంసీ లింగన్న,
యూనివర్సిటీ సాధన సమితి కన్వీనర్
గ్రామస్థాయికి చేరే కార్యాచరణ..
విశ్వవిద్యాలయ ఏర్పాటు ఆవశ్యకతను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు సాధన సమితి కార్యాచరణ రూపొందించింది. కరపత్రాలు, పోస్టర్లు తయారు చేయడం, సామాన్యులకు అర్థమయ్యేలా ఒకపాట రూపొందించాలని నిర్ణయించారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రాలు సమర్పించాలని, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల అధ్యక్షులను కలవాలని తీర్మానించారు. కో–కన్వీనర్లు మండలాల వారీగా బాధ్యతలు తీసుకొని, కళాశాలలకు విశ్వవిద్యాలయ ఆవశ్యకతను వివరించాలని, విద్యార్థులతో సమావేశాలు, మహార్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.