
● ప్రభుత్వ కళాశాలల వైపు విద్యార్థుల చూపు ● ఈ ఏడాది పెరి
లక్ష్మణచాంద: కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల ప్రభా వం, ప్రభుత్వ గురుకులాల ఏర్పాటు తో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఆదరణ తగ్గుతోంది. దీంతో ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు పెరిగాయి. దీంతో మళ్లీ పూర్వవైభవం వస్తుందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. గతంలో సరైన మౌలిక వసతులు, తగినంత అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు వెనుకాడేవారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల రూపురేఖలు మారుతున్నాయి. మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలతో విద్యార్థులు ఈ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పెరిగిన ప్రవేశాలు..
జిల్లా వ్యాప్తంగా 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు. జిల్లా నోడల్ అధికారి పరశురామ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, గత విద్యా సంవత్సరం (2024–25)లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,252 మంది విద్యార్థులు చేరగా, ఈ విద్యా సంవత్సరం (2025–26)లో ఇప్పటివరకు 2,592 మంది ప్రవేశం పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే 340 మంది విద్యార్థులు అధికంగా చేరినట్లు అధికారులు తెలిపారు.
కారణాలు ఇవీ...
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గతంలో సొంత భవనాలు లేకపోవడం, ఉన్నవి పురాతన భవనాల్లో తరగతులు నిర్వహించడం సమస్యగా ఉండేది. ఇప్పుడు జిల్లాలోని అన్ని కళాశాలలకు సొంత భవనాలు సమకూరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మౌ లిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. కళాశాల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంకితభావం, అనుభవం ఉన్న అధ్యాపకులు విద్యాబోధన చేస్తున్నారు. ప్రతిరోజూ కళాశాలల్లో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందిన్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. ఇవే కాకుండా, పదో తరగతి ఫలితాలు వెలువడిన వెంటనే కళాశాల అధ్యాపకులు గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అవగాహన కల్పించడం కూడా ప్రవేశాల పెరుగుదలకు దోహదపడింది.
ప్రవేశాల గడువు పెంపు..
ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు జూలై 31ని చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వెలువడడంతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం ప్రవేశాల గడువును పొడిగించారు. ఈ నెల 20 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల సంఖ్య మరింత పెరుగుతుందని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు.
మరింత పెరిగే అవకాశం
ప్రభుత్వ జూనియర్ కళాశాలు 13
ఫస్టియర్ విద్యార్థులు 2,592
సెకండియర్ విద్యార్థులు 2,252
జనరల్‌లో చేరిన విద్యార్థులు 2198
ఒకేషనల్‌లో చేరిన విద్యార్థులు 394
జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్నాయి. ఇప్పటికే 2,592 మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో చేరారు. మరింత ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే 340 అడ్మిషన్లు పెరిగాయి. గడువు పెంచిన నేపథ్యంలో మరిన్ని ప్రవేశాలు ఉంటాయి. – పరశురామ్‌నాయక్ జిల్లా నోడల్ ఆఫీసర్