
‘డబుల్’ పనులకు ఎమ్మెల్యేనే అడ్డు
● మహేశ్వర్‌రెడ్డిపై మాజీ మంత్రి తీవ్ర ఆరోపణ ● సిద్దాపూర్ వద్ద పనులు పూర్తి చేయాలని డిమాండ్ ● లేదంటే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరిక
నిర్మల్ టౌన్: నిర్మల్ పట్టణంలోని సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అడ్డుకుంటున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సదుపాయాలు కల్పించాలని సిద్ధాపూర్‌లో మంగళవారం ధర్నా చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే నిర్మల్ నియోజకవర్గంలో 2 వేలకుపైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామన్నారు. సిద్దాపూర్ వద్ద నిర్మించిన ఇళ్లలో చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4.8 కోట్లు మంజూర చేసిందన్నారు. కానీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పనులు చేయించకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కమీషన్ల కోసం వారిని వేధిస్తున్నాడని విమర్శించారు. ఈనెల 25లోపు పనులు ప్రారంభించాలని, 4 నెలల్లో పనులను పూర్తి చేయకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 25లోపు పనులు ప్రారంభించకుంటే కలెక్టరేట్ వద్ద 600 మంది లబ్ధిదారులతో ధర్నా చేస్తానని హెచ్చరించారు. మంత్లీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న మహేశ్వర్ రెడ్డి నిర్మల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ కౌన్సిలర్ రవూఫ్, నాయకులు నర్సాగౌడ్, ముడుసు సత్యనారాయణ, అనుముల భాస్కర్, నాలం శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, రమేశ్, గజేందర్, అన్వర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.