మేకను కాపాడబోయి..
● బావిలో చిక్కుకున్న కాపరి
బోథ్: మేకను కాపాడబోయి కాపరి బావిలో చిక్కుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన ఓ మేకల కాపరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గల వ్యవసాయ క్షేత్రంలో మేకలను మేతకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు ఓ మేక పడిపోయింది. గమనించిన కాపరి మేకను కాపాడాలని బావిలోకి దిగాడు. తనకు తోడుగా వచ్చిన వ్యక్తి బావి బయట ఉండడంతో మేకను తాడు సాయంతో పైకి పంపించాడు. ఆ తర్వాత అతనూ పైకి రావడానికి నానా ఇబ్బందులు పడ్డాడు. స్థానికులు గమనించి అతడిని అతికష్టం మీద బయటకు తీశారు. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇచ్చోడ నుంచి ఫైరింజన్ కూడా వచ్చింది. అప్పటికే కాపరి బావి నుంచి బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


