బాధ్యతలు స్వీకారం.. అభివృద్ధికి శ్రీకారం
లోకేశ్వరం: జిల్లా వ్యాప్తంగా సోమవారం గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రమాణ స్వీకార వేడుకలే కాకుండా, పదవి చేపట్టిన తొలిరోజే పలు గ్రామాల్లో నూతన సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టారు. లోకేశ్వరం మండలంలోని రాయాపూర్ కాండ్లీ సర్పంచ్ బాతురి వెంకటేశ్ ప్రమాణ స్వీకరణ అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల్లో వీది దీపాలను అమర్చారు. లోకేశ్వరం సర్పంచ్ దార్వాడి కపిల్ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పథకం ప్రీమియంను చెల్లించి కార్మికులకు కార్డులు అందజేశారు. ఏదైనా ప్రమాదంలో జీపీ కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.15లక్షల బీమా వర్తిసుందన్నారు. ధర్మోర గ్రామ సర్పంచ్ మామిడి సంజీవరెడ్డి ప్రభుత్వం అందించే తన వేతనం నుంచి ఒక్క రూపాయి మాత్రమే తన సొంత ఖర్చులకు వాడుకుంటానని, మిగితా నగదు గ్రామంలో నిరుపేదలకు అందజేస్తానన్నారు. హథ్గాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతుండగా, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ రమేశ్ పాఠశాల వరకు పైప్‌లైన్ తవ్వించి తాగునీటి సౌకర్యం కల్పించారు.
రూప్‌లైట్‌ల ఏర్పాటు
ఖానాపూర్: మండలంలోని రాజూరా గ్రామానికి చెందిన చేగంటి మల్లేశ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రూ.50వేలకుపైగా తన సొంత డబ్బులతో గ్రామంలోని ప్రధాన రహదారి వెంట విద్యుత్ స్తంభాలతో పాటు పలు విగ్రహాలకు రూప్(బెల్ట్)లైట్‌లను ఏర్పాటు చేశారు.


