పంచాయతీల్లో ‘కొత్త’ జోష్
కొలువుదీరిన నూతన పాలకవర్గాలు ముగిసిన స్పెషల్ ఆఫీసర్ల పాలన జిల్లాలో 399పంచాయతీలు, 3368వార్డులు సవాల్‌గా మారనున్న నిర్వహణ భారం 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ పంచాయతీ పాలన బాధ్యతల నుంచి స్పెషల్ ఆఫీసర్లు తప్పుకున్నారు. ఈ స్థానంలో స్థానిక సంస్థల్లో ఇటీవల విజయం సాధించిన పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. జిల్లాలోని 399 పంచాయతీల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. 2024 జనవరి 30న నాటి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతను అప్పగించింది. దీంతో 2 ఫిబ్రవరి 2024న గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఆయా శాఖలకు చెందిన గెజిటెడ్ ఆఫీసర్లు బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండేళ్ల పాటు పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ఎట్టకేలకు నూతనంగా ఎన్నికై న పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి.
సమస్యల స్వాగతం..
కొత్తగా కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా ప్రత్యేకాధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి 22నెలలుగా వారి పాలనలోనే పంచాయతీలు కొనసాగాయి. ఇంతకాలం పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. చెత్త నిర్వహణ కొరవడింది. తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. వీధి దీపాల కోసం వాడుకుంటున్న విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయి.
15వ ఆర్థిక సంఘం నిధులొస్తేనే..
నూతన పాలకవర్గాల ఆశలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఉన్నాయి. పంచాయతీలకు రెండు సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత డెయినేజీలు తదితర పనులు అటకెక్కాయి. వీటిని పూర్తి చేయడంతో పాటు సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు, పల్లె ప్రకృతి వనాలు, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, బోర్ల నిర్వహణ ఖర్చులు.. ఇప్పుడు కొత్త సర్పంచ్‌లకు భారంగా మారనున్నాయి.
త్వరలో శిక్షణ కార్యక్రమాలు..
కొత్తగా ఎన్నికై న సర్పంచులకు నూతనంగా రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. గ్రామపాలన, సర్పంచుల విధులు, బాధ్యతలు, నిధులు, హరితహారం, గ్రామాభివద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రి, స్టేషనరీని సమకూర్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకుంటే తమ గ్రామాలు, వార్డులు బాగుపడతాయని ఆయా ప్రాంతాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
నిలిచిన కేంద్రం నిధులు..
ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. రాష్ట్రం కూడా తన వాటా నిధులను ఇవ్వలేక పోయింది. పేరుకే ప్రత్యేకాధికారులు ఉన్నప్పటికీ పంచాయతీల నిర్వహణ భారమంతా కార్యదర్శులు మోయక తప్పలేదు. చాలా మంది అప్పుల పాలయ్యారు. కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారంతో కార్యదర్శులకు ఇబ్బందులు తప్పనుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైతేగానీ పంచాయతీల సమస్యలు పరిష్కరించడం సాధ్యమయ్యేపని కాదని పలువురు స్పష్టం చేస్తున్నారు.


