రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. వేడుకలకు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వేదికను పూలతో అలంకరించి, ప్రొటోకాల్ నిబంధనల మేరకు సీటింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థులతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంటులు, షామియానాలు, తాగునీరు, అల్పాహారం, పండ్ల సరఫరా నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. పరిసరాలలో శుభ్రత పాటించాలని, పోలీస్, అగ్నిమాపక శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యశాఖ అత్యవసర మందులతోసహా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం సహా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


