రైతులపై మరో భారం
● రెట్టింపైన జీలుగ విత్తనాల ధర ● వానాకాలం సీజన్‌కు ముందే పెంచిన ప్రభుత్వం ● 30 కేజీల జీలుగ ధర రూ.2,137
లక్ష్మణచాంద/మామడ: సాగు భూములను సారవంతం చేయడానికి ఖరీదైన రసాయన ఎరువులు, బయటి నుంచి మట్టి తరలించడం కన్నా, జీలుగ వ ంటి పచ్చిరొట్ట పంటలు రైతులకు పెట్టుబడి భారం తగ్గిస్తాయి. ఈమేరకు వ్యవసాయాధికారులు కూడా పచ్చిరొట్ట సాగును ప్రోత్సహిస్తారు. జీలుగ సాగు నేల స్వభావాన్ని మెరుగుపరిచి, పంటల దిగుబడిని పెంచుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జీలుగ విత్తనాల ధరలను రెండింతలు పెంచింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూసారం పెంచేందుకు..
జీలుగను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసి, 45 రోజు ల తర్వాత కలియదున్నడం ద్వారా నేల సారవంతం అవుతుంది. ఇది నీటి సామర్థ్యాన్ని పెంచి, 2% నత్రజని, సూపర్ పాస్ఫేట్, జింక్, కాల్షియం, ఇను ము వంటి సూక్ష్మ పోషకాలను పంటలకు అందిస్తు ంది. ఎకరానికి 10–12 కిలోల జీలుగ విత్తనాలను తొలకరి వర్షాల తర్వాత విత్తి, పూత దశలో దుక్కి దున్నడం ద్వారా 10 టన్నుల పచ్చిరొట్ట ఎరువు తయారవుతుంది. ఒక టన్ను ఎరువులో 6 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 3 కిలోల పొటాష్ లభిస్తాయి. ఇది రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, రైతుల పెట్టుబడి ఖర్చును తగ్గిస్తుంది.
జీలుగ ధరల పెంపు..
రైతు భరోసా సబ్సిడీపై స్పష్టత లేని నేపథ్యంలో, రైతులు పెట్టుబడికి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో జీలుగ విత్తనాల ధరలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతేడాది 30 కిలోల జీలుగ బస్తా రూ.1,116 ఉండగా, ఈ ఏడాది రూ.2,137కి పెంచారు. ఈ ధరల పెంపు సాగు ఖర్చులను పెంచి, రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది.
పంపిణీ ఆలస్యం..
మరోవైపు జిల్లాకు జీలుగ విత్తనాలు ఇంకా పంపిణీ కాకపోవడం రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పచ్చిరొట్ట విత్తుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగుకు 3,500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించారు. ఇవి 50% సబ్సిడీపై త్వరలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది 35 వేల ఎకరాలకు సరిపోతుంది. పెంచిన ధర తగ్గించడంతోపాటు త్వరగా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


