ప్రజల‘వాణి’ విని.. భరోసా కల్పించి..
● గ్రీవెన్స్ కు 71 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్ అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు అందించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రైతు రుణమాఫీ, వైద్యం, విద్య, వ్యవసాయం, భూ వివాదాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించి మొత్తం 71 దరఖాస్తులు అందాయి. ఇక టెలిఫోన్ ప్రజావాణికి విశేష స్పందన లభించింది. ఫోన్ ద్వారా వచ్చిన అర్జీలను నమోదు చేసి, వాట్సాప్‌లో రశీదు పంపించారు. అనంతరం కలెక్టర్ శాఖలవారీగా సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయడంతోపాటు, ఫైళ్లలో స్పష్టమైన రిమార్కులు నమోదు చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని, మండల ప్రత్యేకాధికారులు మండలస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతుల పరిశీలన, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరిక పెంచే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతుల ఆవేదన..
కౌట్ల గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ మందగించిందని, ఇప్పటివరకు కేవలం ఐదు లారీల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని గ్రామ రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. తూకంలో ఆలస్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నామని తెలిపారు. డీసీఎంఎస్ ద్వారా మరో కేంద్రం ఏర్పాటు చేసి, కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం..
నర్సాపూర్(జి) మండలంలో మూడేళ్ల క్రితం నిర్మించిన 50 డబుల్ బెడ్‌రూం ఇళ్లు పర్యవేక్షణ లోపంతో శిథిలమవుతున్నాయని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
అక్రమ పట్టా రద్దు చేయాలి..
నిర్మల్‌లోని శాస్త్రినగర్‌లో 541 సర్వే నంబర్‌లో 6.21 భూమి కలదు. 541/3 సర్వే నంబర్ లో నా భార్య పాకాల స్వప్న పేరుమీద ఎకరం భూమి ఉంది. ఒక వ్యక్తి 541/4/హెచ్ సర్వే నంబర్ పేరుతో మూడు ఎకరాలు అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. ఇదే విషయం ఆర్డీవో, తహసీల్దార్‌కు 20 సార్లు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమ పట్టా రద్దు చేయాలి. – పాకాల చంద్రశేఖర్, నిర్మల్
నిధులు దుర్వినియోగంపై చర్య తీసుకోవాలి
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు తమ కుటుంబ సభ్యుల పేరిట వాహనాలు కొని వాటిని అద్దెకు తీసుకుని నెలకు రూ.33 వేలు ప్రభుత్వం నుంచి పొందుతున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం.వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడమే కాకుండా, అవినీతికి కూడా తావిస్తోంది. ఇలాంటివారిపై చర్య తీసుకోవాలి.
– హైదర్, ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు
ప్రజల‘వాణి’ విని.. భరోసా కల్పించి..
ప్రజల‘వాణి’ విని.. భరోసా కల్పించి..


