వాతావరణం
ఆకాశం కొంతమేర మేఘావృతమై ఉంటుంది. పగటిపూట తీవ్రమైన వేడి, ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం వాతావరణం చల్లబడుతుంది.
భూభారతితో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన భూభారతి చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ చట్టం అమలుతో ధరణి చట్టానికి ముందున్న సాదాబైనామా ప్రక్రియ తిరిగి వినియోగంలోకి రానుందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే తహసీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. నేటి నుంచి కుంటాల మండలంలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయని, ప్రజల నుంచి భూసంబంధిత దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సందీప్ కుమార్, తహసీల్దార్ రాజు, రైతులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులు
సద్వినియోగం చేసుకోవాలి
లోకేశ్వరం(కుంటాల): రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కుంటాల మండలంలోని ఓలలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. భూభారతి చట్టంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమిపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తోందన్నారు. కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిందన్నారు. క్షేత్రస్థాయి విచారణకు వచ్చే రెవెన్యూ బృందాలకు రైతులు సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఏజాజ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.


