ముసాయిదా మార్చాల్సిందే!
● ఈనెల 8 వరకూ అభ్యంతరాల స్వీకరణ
నిర్మల్: జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో ఓటరు ముసాయిదా జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వార్డుల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల పేర్లే లేకపోవడం, వేరే వార్డులో రావడంపై మండిపడుతున్నారు. ఇదంతా కావాలనే చేశారంటూ పలు పార్టీల నాయకులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదాలో ఓటర్ల మార్పుపై ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్, నిర్మల్, భైంసాల్లో బీజేపీ నాయకులు ఫిర్యాదులు చేశారు. ఐదేళ్లక్రితం జాబితాకు ప్రస్తుత ఓటరులిస్టుకు ఏమాత్రం పొంతన లేదని ఆరోపించారు. మరోవైపు నాయకులు, ఆశావహులతోపాటు సామాన్య ఓటర్లూ తమ వార్డులు మారాయని, ఓట్లు రాలేవని మున్సిపాలిటీల్లో అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
ఎలా మారుతాయంటూ..
అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో ఓటు ఎక్కడ ఉన్నా.. పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ.. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి సంబంధిత వార్డులోనే ఓటు ఉండాలి. అలా లేకపోవడం ఓటరు కన్నా.. పోటీచేసే ఆశావహులకు పెద్ద ఇబ్బందిగా మారుతుంది. తమ వార్డులో తమకు తెలిసినవారివి కాకుండా పక్కవార్డులు, గ్రామాల నుంచి ఓటర్లు ఉంటే తమకు ఓట్లు ఎలా వచ్చాయన్నదే వారి వాదన. నిర్మల్, ఖానాపూర్, భైంసాల్లో ముసాయిదాలో ఇదే జరిగింది. పక్క గ్రామాలతోపాటు భైంసాలోనైతే మహారాష్ట్రవాసుల ఓట్లూ ఉన్నట్లు అభ్యంతరాలు వస్తున్నాయి.
మార్పులకు సన్నద్ధం..
మూడురోజులుగా ముసాయిదాపై వస్తున్న అభ్యంతరాలతో మున్సిపల్ అధికారులకు ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది. ఈమేరకు మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంటున్నారు. కొన్నివార్డుల్లో ఏకంగా వందల్లో ఓట్లు పెరగడం, తగ్గడం, మార్పులు, చేర్పులు కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులు మార్పులను చేపడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితాపై నిర్మల్‌లో 45, ఖానాపూర్‌లో 42, భైంసాలో 21 అభ్యంతరాలు వచ్చాయి. ఈనెల 8 వరకూ అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది. 9న సరిచూసుకుని, 10న ఫైనల్ జాబితాను ప్రకటిస్తామని పేర్కొంటున్నారు.
అభ్యంతరాలు పరిశీలిస్తున్నాం..
ఓటరు ముసాయిదాపై వస్తున్న అభ్యంతరాలను స్వీకరిస్తున్నాం. భారీగా అభ్యంతరాలు వస్తున్న వార్డులకు సంబంధించి ఇప్పటికే మార్పులు చేపడుతున్నాం. అభ్యంతరాలను సరిచూసుకున్న తర్వాతనే ఫైనల్ జాబితాలో పొందుపరుస్తాం.
– జగదీశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్


