
అర్జీలు తక్షణమే పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణికి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 86 వినతులు వచ్చాయి. అందులో ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్ల మంజూరు దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కరించలేని అంశాలు ఉంటే ఫిర్యాదుదారులకు అక్కడే అవగాహన కల్పించాలన్నారు. ఒక సమస్యపై ఫిర్యాదు దారుడు పలుమార్లు వచ్చే దుస్థితి ఉండవద్దన్నారు.
అనుమతి తప్పనిసరి..
ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, హాజరుకాలేని పక్షంలో తనకు ఫోన్ చేసి విషయం చెప్పి సెలవు తీసుకోవాలన్నారు. అధికారులంతా సమయపాలన పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవి దష్ట్యా ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణిలో 91005 77132 నంబరుకు కాల్ చేసి ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.