అక్షయ తృతీయ.. కొనుగోళ్లు అంతంతే
● పర్వదినాన ఆసక్తి చూపని ప్రజలు ● జిల్లాలో తగ్గిన పసిడి కొనుగోళ్లు.. ● ధర పెరుగుదలతో సంప్రదాయం పక్కన పెట్టిన వినియోగదారులు
నిర్మల్‌ఖిల్లా: అక్షయ తృతీయ పర్వదినం అనగానే ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని సంప్రదాయంగా భావిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రంలోని బంగారం మార్కెట్లో బుధవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.98,800 ఉండడంతో కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత బంగారం ఉంటే చాలు.. తర్వాత చూద్దాంలే అన్నట్లుగా ఆలోచిస్తున్నారు.
ఈసారి అంతంతే...
ఏటా అక్షయ తృతీయను పురస్కరించుకొని జిల్లాలోని దుకాణాలు కిటకిటలాడేవి. ఈసారి మాత్రం బంగారం ధర ఏకంగా లక్షకు చేరువ కావడంతో విక్రయాలు అమాంతం పడిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు స్వర్ణకారులకు కూడా ఉపాధి లేకుండా పోయింది. బంగారం కొనుగోలు లేక నగలు ఆభరణాలు తయారీ కూడా అంతంత మాత్రంగానే సాగుతోందని అంటున్నారు.
వ్యాపారం సన్నగిల్లింది..
గతంతో పోల్చితే ఈ ఏడు జనవరి నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఏప్రిల్ నాటికి 24 క్యారెట్ బంగారం ధర ఏకంగా లక్షకు చేరింది. దీంతో గతంతో పోల్చితే వ్యాపారం, నగల తయారీదారులకు ఉపాధి భారీగా సన్నగిల్లింది. వివాహాది శుభకార్యాలను కూడా అతికొద్ది బంగారం కొనుగోళ్లతోనే కానిచ్చేస్తున్నారు.
భైంసాటౌన్: అక్షయ తృతీయ సందర్భంగా విత్తనాలతో పాటు బంగారం కొనుగోళ్లతో మార్కెట్ సందడిగా కనిపించింది. అక్షయ తృతీయకు ఇక్కడి రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ధర ఎక్కువగా ఉండడంతో, బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు.
కుంటాల: మండలంలోని రైతులు విత్తనాలు, బంగారం కొనుగోలు చేశారు. అందాకూర్, పెంచికల్ పాడ్ గ్రామాల్లో స్వాధ్యాయ పరివార్ సభ్యులు పంట చేలలో భూమిపూజ చేశారు.
24 క్యారెట్ మేలిమి బంగారం ధరలు
(10 గ్రాములకు )
సంవత్సరం ధర రూ.లలో
2010 22,800
2015 32,500
2020 50,250
2025 98,800
అక్షయ తృతీయ.. కొనుగోళ్లు అంతంతే


