గాంధీ పేరు తుడిచేయాలనే కుట్ర
‘ఉపాధి’ పథకం పేరు మార్పు అందుకే పనిదినాలు పెంచి, పాతచట్టమే కొనసాగించాలి డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జుపటేల్ ఈనెల 20 నుంచి ఆందోళనలకు పిలుపు
నిర్మల్: పేదప్రజల గుండెల్లో నుంచి మహాత్మాగాంధీ పేరు తుడిచివేయాలనే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధిహామీ పథకం పేరు మార్చిందని, ఆ పథకాన్ని నీరుగార్చేందుకే కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావుతో కలిసి శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. తాను, తన కుటుంబం కూడా మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలుగా పనిచేశామన్నారు. ఆ పథకం ఎంతోమంది పేదల కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. పనిదినాలు పెంచడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, పథకాన్ని దెబ్బతీసి, పేదల పొట్ట కొట్టేందుకు కేంద్రం కొత్త చట్టంలో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న కుట్రలపై గ్రామస్థాయి నుంచి ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు. ఈమేరకు జిల్లాలో ఈనెల 20 నుంచి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు జిల్లాకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ వస్తారని చెప్పారు.
బీజేపీని తిప్పికొట్టాలి..
ఉపాధి పథకం కోసం 40 శాతం నిధులు చెల్లించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, దీనిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని బొజ్జు పటేల్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మోదీని గద్దె దింపడానికి పోరాడుతున్నారని పేర్కొన్నారు. మత విద్వేషాలతో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనుకుంటున్న బీజేపీని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఈనెల 16న సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు వస్తారని బొజ్జు పటేల్ తెలిపారు. సమావేశంలో గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు భీంరెడ్డి, హాదీ, ఆనంద్‌రావు, మున్సిపల్ మాజీచైర్మన్ గణేశ్‌చక్రవర్తి, పీసీసీ ప్రధానకార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, సీనియర్ నేతలు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, కృష్ణవేణి, నాందేడపు చిన్ను, సమరసింహారెడ్డి, జునైద్ తదితరులు పాల్గొన్నారు.


