మృత్యు మాంజా!
నిషేధించినా దుకాణాల్లో ప్రత్యక్షం ప్రాణాలను తీస్తున్న చైనా దారం వినియోగం ప్రమాదరకం అంటున్న పోలీసులు పండగ సురక్షితంగా జరుపుకోవాలని సూచన
నిర్మల్‌టౌన్: సంక్రాంతి పండుగ అనగానే రంగవల్లులు.. ఇళ్లలో పిండి వంటల ఘుమఘుమలు.. ఆ కాశంలో పతంగులు.. గుర్తొస్తాయి. ముగ్గులతో ఆడ పిల్లలు తమ కళానైపుణ్యం ప్రదర్శిస్తారు. ఇక పిండి వంటల తయారీలో మహిళలు బిజీగా గడుపుతారు. పిల్లలు, యువత పంగులు ఎగురవేస్తూ సందడి చేస్తారు. పోటీల్లో తమ గాలిపటం ఎత్తుకు ఎగరాలని, ప్రత్యర్థి పతంగిని పడగొట్టాలని చూస్తారు. ఈ క్రమంలోనే నిషేధిత చైనా మాంజా కొంటున్నారు. ఇది పక్షులు, జంతువులతోపాటు మనుషులకు కూడా ప్రాణాంతకంగా మారింది. పండగ సమయంలో గాలిపటాలకు కట్టి ఎగురవేయడంతో తర్వాత అవి చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి.
రసాయనాలతో కూడిన దారం..
గాజుపొడి, ప్రమాదకర రసాయనాలతో తయారైన చైనా మాంజా తక్కువ ధరకు, రంగురంగుల్లో, అధిక బలంతో మార్కెట్‌లో ఆకర్షిస్తుంది. సాధారణ తాళ్ల దారాలతో పోల్చితే ధర తక్కువ కావడం వల్ల ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటారు. కానీ ఇది పర్యావరణానికి, జీవాల పాలిట మృత్యు దారం. పోలీసులు కొనుగోలు, విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటున్నా విక్రయాలు ఆగడం లేదు.
2017లో నిషేధం..
2017 రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించింది. 1998 పర్యావరణ చట్టం ప్రకారం అమ్మకం, కొనుగోలు చేస్తే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండేళ్ల క్రితం మళ్లీ నిషేధం మరోమారు పునరుద్ధరించారు. అయినా మార్కెట్లలో గుట్టుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి జిల్లాకు సరఫరా జరుగుతోంది.
లభాపేక్షతో..
వ్యాపారులకు ఒక మాంజాపై రూ.20 లాభం వస్తుంది. అక్రమ దిగుమతులతో పెద్ద లాభాలు సంపాదించే మధ్యవర్తులు ఉన్నారు. దీంతో వ్యాపారులు కూడా చైనా మాంజా విక్రయానికే మొగ్గు చూపుతున్నారు. డిమాండ్ ఉందని ప్రాణాపాయాలను పట్టించుకోకుండా అమ్మకాలు చేస్తున్నారు.
పక్షులు, జంతువులు, మనుషులపై ప్రభావం..
చైనా మాంజా పతంగులు ఎగురవేస్తున్న సమయంలో ఎగురవేసే వారి చేతులకు, పక్షులకు తీవ్ర గాయాలు అవుతాయి. దారం చెట్లు, విద్యుత్ స్తంభాలకు చిక్కుకుని వేలాడుతూ ఎగిరే పక్షులను చంపతున్నాయి. ఇళ్లలలో తిరిగే కోతుల మెడకు చుట్టుకుని ఉసురు తీస్తున్నాయి. వాహనదారులు రోడ్లపై వెళ్తున్న సమయంలో గొంతులను కోస్తున్నాయి.
ఖానాపూర్: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఇమ్రాన్ కలెక్షన్స్ పేరుతో ఉన్న బట్టల షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 32 నిషేధిత చైనా మాంజాలను పట్టుకున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. దుకాణం యజమాని ఎండీ.అస్లాంపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


