ఖానాపూర్: పేదప్రజలు, పీడిత జనుల ఆర్తనాదాలను ఆపి బానిస బతుకులను రూపుమాపేందుకు అవతరించిన తెలంగాణ భగత్‌సింగ్ అనభేరి ప్రభాకర్‌రావు సేవలు మరువలేనివని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి నంది రామయ్య కొనియాడారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతిభవనం ఆవరణలో ఎల్లాపి సంఘం నిర్మల్ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల మురళి అధ్యక్షతన నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ జిల్లా పోలంపల్లికి చెందిన ప్రభాకర్‌రావు విద్యార్థి దశ నుంచే నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. పాలేర్ల పిల్లలకు చదువులు చెప్పించడంతోపాటు తన ఇంట్లో ఉండే పని మనుషులకు వివాహాలు చేసి వారి జీవితాల్లో స్వేచ్ఛ వెలుగులు నింపి సీ్త్ర జాతి గౌరవాన్ని కాపాడారని గుర్తు చేశారు. నేతన్నలను ఆకలిచావుల నుంచి తప్పించడంతో పాటు పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. నిజాంకు సింహస్వప్నంలా మారి తెలంగాణ ప్రజల విముక్తికి ఉద్యమించిన అనభేరి విగ్రహాన్ని ట్యాంక్‌బాండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్, అంకం రాజేందర్, నిమ్మల రమేశ్, గంగనర్సయ్య, గణపతిరావు, పడాల మోహన్‌రావు, పెరిక గంగాధర్, లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాస్, కాంతారావు, భీంరావు, చందు, సతీశ్ తదితరులున్నారు.