తానూరు: మహారాష్ట్ర సరిహద్దున ఉన్న జిల్లాలోని పలు మండలాల ప్రజలను చిరుతలు భయపెడుతున్నాయి. కొన్ని నెలలుగా పశువులపై దాడిచేసి చంపేస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత మహారాష్ట్ర వైపు ఉన్న గుట్టల నుంచి చిరుత పులులు జిల్లాలోని గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజాగా తానూరు మండలం బెంబర గ్రామ శివారులో రైతు లచ్చన్న చేనులో కట్టేసిన లేగదూడపై దాడిచేసి చంపేసింది. దానిని సమీపంలోని చెట్టుపైకి తీసుకెళ్లి సగం తినేసింది.
సరిహద్దు మండలాల్లో సంచారం...
సరిహద్దు మండలాలైన తానూరు, భైంసా, కుభీర్, ముధోల్, కుంటాల, సారంగాపూర్ మండలాలు అటవీ ప్రాంతం కలిగి ఉంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న చిరుతలు జిల్లాలోని అటవీ ప్రాంతాల మీదుగా గ్రామాల సరిహద్దులకు వస్తున్నాయి. పొలాల వద్ద సంచరించే పశువులపై దాడి చేసి చంపుతున్నాయి. గతంలో ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగినప్పుడే గ్రామానికి వస్తున్న అటవీ అధికారులు చిరుతల రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
భయందోళనలో రైతులు, గ్రామీణులు..
తానూరు, కుభీర్, కుంటాల, ముధోల్, సారంగాపూర్, భైంసా మండలాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉండడంతో, సరిహద్దు గ్రామాల రైతులు పొలాలు అటవీ ప్రాంతంలో ఉండడంతో చిరుతలు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో పశువులపై దాడి చేస్తుండడంతో పంటలకు కాపలా వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. ఇతర గ్రామాలకు వెళ్లిన వారు రాత్రి సమయంలో తమ గ్రామాలకు రావడానికి కూడా జంకుతున్నారు. తమకు రక్షణ చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చిరుత పులులను గుర్తించి గ్రామాల్లోకి రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
బెంబర గ్రామంలో చెట్టుపై దూడ కళేబరం
Comments
Please login to add a commentAdd a comment