ఈసారీ సర్దుబాటేనా..? | - | Sakshi
Sakshi News home page

ఈసారీ సర్దుబాటేనా..?

Jun 14 2023 1:02 AM | Updated on Jun 14 2023 11:51 AM

- - Sakshi

భైంసాటౌన్‌: బడిగంట మోగింది.. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో విద్యాశాఖ ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ఆయా ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ ప్రచారం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలతో విద్యాబోధన ఎలా చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదివరకు ఉపాధ్యాయ ఖాళీల స్థానంలో ప్రభుత్వం ఏటా విద్యావలంటీర్లను నియమించేది. 2020 నుంచి ప్రభుత్వం వీవీలను విధుల్లోకి తీసుకోవడం లేదు. దీంతో గతేడాది ఉపాధ్యాయ ఖాళీలను వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ పేరిట తక్కువ విద్యార్థులున్న పాఠశాలల నుంచి ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలకు డిప్యూటేషన్‌పై కేటాయించారు. ఈసారి కూడా ఖాళీల్లో సర్దుబాటు చేస్తారా.. అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

బడిబాటలో భారీగా విద్యార్థుల నమోదు..

ఈనెల 3 నుంచి ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమం చేపట్టగా, శనివారం నాటికి జిల్లా వ్యాప్తంగా 3,661 మంది విద్యార్థుల నూతన ప్రవేశాలు నమోదయ్యాయి. వీటిలో 1,257 మంది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి నమోదైనవారే ఉన్నారు. మన ఊరు – మన బడి కింద ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్న పోషకాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, తదితర ప్రయోజనాలపై వివరిస్తున్న ఉపాధ్యాయులు ఖాళీల విషయమై ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నూతనంగా విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయులు లేని పరిస్థితి నెలకొంది.

సబ్జెక్టు టీచర్లేరి..?

జిల్లాలో 735 ప్రభుత్వ పాఠశాలల్లో 2022–23 విద్యాసంవత్సరంలో 49,943 మంది విద్యార్థులు ఉండగా, మన ఊరు – మన బడి కింద రూ.120 కోట్లతో 260 పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టారు. వీటిలో 126 పాఠశాలల్లో పనులు పూర్తి చేసుకున్నాయి. కాగా, జిల్లావ్యాప్తంగా మొత్తం 521 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా, చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు.

దీంతో ఒక సబ్జెక్టు టీచర్‌తో మరో సబ్జెక్టు బోధించడం, ఆంగ్ల, తెలుగు మాధ్యమాలకు ఒకే టీచర్‌ ఉండడంతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపే అవకాశముంది. గతంలో ప్రభుత్వం ఏటా ఉపాధ్యాయ ఖాళీల్లో విద్యావలంటీర్లను నియమించి విద్యాబోధనలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేది. 2020 నుంచి ప్రభుత్వం విద్యావలంటీర్లను విధుల్లోకి తీసుకోవడం లేదు. ఇతర పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ నెట్టుకొస్తున్నారు.

జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలిలా...

సబ్జెక్ట్‌ మంజూరు ఖాళీలు

గణితం (ఎస్‌ఏ) 191 16

భౌతికశాస్త్రం (ఎస్‌ఏ) 180 07

జీవశాస్త్రం (ఎస్‌ఏ) 164 32

సాంఘికశాస్త్రం (ఎస్‌ఏ) 183 75

తెలుగు (ఎస్‌ఏ) 67 13

హిందీ (ఎస్‌ఏ) 42 12

ఇంగ్ల్లిష్‌ (ఎస్‌ఏ) 167 01

ఉర్దూ (ఎస్‌ఏ) 11 05

హిందీ (ఎల్‌పీ) 96 01

మరాఠీ (ఎల్‌పీ) 02 02

ఉర్దూ (ఎల్‌పీ) 07 01

ఎస్‌జీటీలు 1,478 231

భైంసా పట్టణంలోని పిప్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 232 విద్యార్థులు ఉండగా, ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ, ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ ఉపాధ్యాయులుండగా, మరో ఇద్దరిని డిప్యూటేషన్‌పై కేటాయించారు. మన ఊరు – మనబడిలో భాగంగా ప్రస్తుతం రెండు తరగతి గదులతో నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు.

భెంసాలోని ఏపీనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు 250 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ ఉపాధ్యాయులున్నారు. మిగిలిన సబ్జెక్టులకు నలుగురిని డిప్యూటేషన్‌పై కేటాయించారు. గతేడాది ఫిజికల్‌ సైన్స్‌ బోధించే ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు తరగతులు నష్టపోయారు. కాగా, ఈసారి కూడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారా.. లేదా.. అన్నది వేచిచూడాలి.

ఇబ్బందులు లేకుండా చర్యలు

పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులు ఉండి, అసలే ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నాం. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేని చోట ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఉపాధ్యాయ ఖాళీల స్థానంలో సర్దుబాటు విషయమై స్పష్టత రావాల్సి ఉంది. – రవీందర్‌రెడ్డి, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement