మీర్జా రహ్మత్ బేగ్
రాజీనామాకు నో అంటున్న ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్?
అవసరమైతే అనర్హత వేటు వేసే యోచనలో అధిష్టానం..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంతో శాసిస్తున్న ఏఐఎంఐఎం (మజ్లిస్) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజాప్రతినిధి అధిష్టానం నిర్ణయాన్నే ధిక్కరించే దిశగా అడుగులు వేస్తుండటం స్థానిక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తీవ్రమైన వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో మజ్లిస్ అధిష్టానం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను (Mirza Rahmath Baig) అర్ధరాత్రి వేళ పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయన తన ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేది లేదని బేగ్ తన వర్గీయుల వద్ద స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతుండటంతో మజ్లిస్ చరిత్రలోనే ఇది మొదటి ధిక్కార స్వరంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్రా యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రహ్మత్ బేగ్ శనివారం మౌనంగా ఉన్నప్పటికీ, ఆదివారం తన అనుచరులతో జరిపిన అంతర్గత సంభాషణల్లో ధిక్కార స్వరం వినిపించినట్లు తెలుస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతానని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేదిలేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రహ్మత్ బేగ్ రాజీనామా.. రాజాసింగ్ డిమాండ్ ఇదే
ఒకవేళ బేగ్ స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసి ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయించేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతోంది. మరొకవైపు బీజేపీ వంటి ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై సమగ్ర పోలీసు విచారణకు పట్టుబడుతుండటంతో రహ్మత్ బేగ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఇన్‌చార్జిగా బహదూర్‌పురా ఎమ్మెల్యే
మజ్లిస్ పార్టీ రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.


