సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు.. ప్రజల ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయిందని వాపోయారు.పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
హరీష్ రావు ఎక్స్‌లో.. పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు రాష్ట్రంలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది.హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే మీ ప్రభుత్వం మేల్కొంటుంది? మహిళలకు భద్రత కల్పించలేని మీకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా? ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలి. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.


