breaking news
All India Majlis-e-Ittehadul Muslimeen
-
ఓవైసీ పార్టీలో ధిక్కార స్వరం!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంతో శాసిస్తున్న ఏఐఎంఐఎం (మజ్లిస్) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజాప్రతినిధి అధిష్టానం నిర్ణయాన్నే ధిక్కరించే దిశగా అడుగులు వేస్తుండటం స్థానిక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తీవ్రమైన వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో మజ్లిస్ అధిష్టానం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను (Mirza Rahmath Baig) అర్ధరాత్రి వేళ పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయన తన ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేది లేదని బేగ్ తన వర్గీయుల వద్ద స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతుండటంతో మజ్లిస్ చరిత్రలోనే ఇది మొదటి ధిక్కార స్వరంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్రా యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రహ్మత్ బేగ్ శనివారం మౌనంగా ఉన్నప్పటికీ, ఆదివారం తన అనుచరులతో జరిపిన అంతర్గత సంభాషణల్లో ధిక్కార స్వరం వినిపించినట్లు తెలుస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతానని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేదిలేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రహ్మత్ బేగ్ రాజీనామా.. రాజాసింగ్ డిమాండ్ ఇదేఒకవేళ బేగ్ స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసి ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయించేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతోంది. మరొకవైపు బీజేపీ వంటి ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై సమగ్ర పోలీసు విచారణకు పట్టుబడుతుండటంతో రహ్మత్ బేగ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.ఇన్చార్జిగా బహదూర్‌పురా ఎమ్మెల్యేమజ్లిస్ పార్టీ రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
నరేంద్ర మోడీని ప్రధాని కానివ్వం: అసదుద్దీన్
గుజరాత్లో లౌకికవాదాన్ని మంటగలిపిన వ్యక్తిని దేశ ప్రధానిగా చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొడతామని మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ఒవైసీ పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి దారుసలాంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్యదర్శులకు ఏర్పాటు చేసిన ఈద్ మిలాబ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలను గాయపర్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో ముస్లింలకు ఒరిగేదేమి లేదని, కేవలం మతతత్వ శక్తులకే లబ్ధి చేకూరుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనను ఎంఐఎం వ్యతిరేకించిందన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ముందుకు తెచ్చి, హైదరాబాద్ నగరం నుంచే ఎన్నికల ప్రచారానికి పంపటం వెనుక ఉద్దేశమేమిటని ఆయన ప్రశ్నించారు. మోడీ రాక సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బావమరిది, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్రమంత్రి చిరంజీవి బావమరిది, ఇతర ప్రముఖులు, పలు రాజకీయ నాయకులు హోటల్లో మోడీని కలవటాన్ని బట్టి.. వారు ఎంతవరకు లౌకికవాదాన్ని పాటిస్తున్నారో అర్థమవుతోందన్నారు. రాబోయే ఆరేడు నెలల్లో ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, మజ్లిస్ కార్యకర్తలు ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2009లో మజ్లిస్ పార్టీని ఓడించటానికి సెక్యులర్ ముసుగు ధరించిన పార్టీలు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి సాగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అన్ని ప్రాంతాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతుందని ప్రకటించారు. ఈ నెల 17న సలాఉద్దీన్ ఒవైసీ వర్ధంతి సభ సందర్భంగా పార్టీ తన కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు.


