
మహాకుంభ్‌కు వెళ్లే బిహార్ మహిళల సమాధానం
షాకైన రైల్వే అధికారులు
పట్నా: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు జన జాతర కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీ వరకు ఈ మేళా సాగనుంది. ఇక ముఖ్యమైన దినాలేవీ లేనప్పటికీ జనం లక్షలు, కోట్ల సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు తరలి వెళ్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంటోంది. ఇదే అదనుగా జనం టిక్కెట్ లేకుండానే రైలు ప్రయాణం కానిచ్చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఈ ఘటనే..! బిహార్‌లోని దానాపూర్ డివిజన్ రైల్వే మేనేజర్ జయంత్ కుమార్ ప్రయాణికుల రద్దీతో నెలకొన్న పరిస్థితిపై రెండు రోజుల క్రితం బక్సార్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు.
అదే సమయంలో గ్రామీణ మహిళల బృందం ఒకటి ఆయనకు తారసపడింది. వారిని వివరాలడగ్గా కుంభమేళాకు వెళ్తున్నట్లు చెప్పారు. టిక్కెట్లు కొన్నారా అని ప్రశ్నించగా ముక్తసరిగా లేదని బదులిచ్చారు. టిక్కెట్లు కొనకుండానే రైలు ప్రయాణం చేయవచ్చని ఎవరు చెప్పారని జయంత్ కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీయే అలా తమకు చెప్పారంటూ ఆ మహిళలు ఠకీమని ఇచ్చిన సమాధానంతో ఆయన షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయారు.
చివరికి, ‘అలాంటిదేమీ లేదు. ప్రధాని మోదీయే కాదు, ఏ అధికారి కూడా టిక్కెట్ లేకుండా ప్రయాణం చేయనివ్వరు. ప్రయాణం చేయాలంటే టిక్కెట్ కొనాల్సిందే. లేకుంటే చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటాం’అంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అనంతరం డీఆర్‌ఎం జయంత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పండగ సీజన్‌లప్పుడు చేసినట్లుగానే కుంభ్ మేళాకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. అయితే, జనం రద్దీ తగ్గాల్సిన వేళ పెరుగుతుండటాన్ని తామస్సలు ఊహించలేదన్నారు. లేకుంటే, మరింతగా ఏర్పాట్లు సిద్ధం చేసి ఉండేవారమని వివరించారు.