
సాక్షి, చెన్నై: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజూ చెమ్మల్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కాంచీపురం సమీపంలో 2018లో ఇద్దరు పిల్లల హత్య స్థానికంగా కలకలం రేపింది. విజయ్, అభిరామి దంపతుల పిల్లలైన అజయ్(6), కరి్ణక(4) ఈ హత్యకు గురైనట్టు గుర్తించారు.
ఈ పిల్లలను వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో తల్లే కడతేర్చినట్టు విచారణలో తేలింది. ప్రియుడు మీనాక్షి సుందరం మోజులో పడ్డ అభిరామి భర్త విజయ్, పిల్లలను హతమార్చేందుకు పథకం వేసింది. అయితే, ఘటన జరిగిన రోజున భర్త విజయ్ ఇంటికి రావడంలో ఆలస్యం జరగడంతో పిల్లలు హతమైనట్టు విచారణలో తేలింది. భర్తను హతమార్చ లేక పిల్లల్ని చంపేసి ప్రియుడితో ఉడాయించిన అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసు విచారణ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజు చెమ్మల్ ముందు విచారణ జరిగింది.
వానదనలు, సాక్షుల విచారణలన్నీ ముగిసి గురువారం న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధించారు. ఈ సమయంలో కోర్టుకు వచ్చిన అభిరామి తీర్పు తదుపరి మహిళా కానిస్టేబుల్ కాళ్లను పట్టుకుని కన్నీటి పర్యంతమైంది. అభిరామి, మీనాక్షి సుందరంకు మరణించే వరకు జైలు శిక్షతోపాటూ తలా రూ. 15 వేలు జరిమానా విధించారు.