
ఆ కుక్కలకు వీధుల్లో ఎందుకు ఆహారం అందిస్తున్నారు?
వీధికుక్కలకు ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటుచేయాలన్న పిటిషనర్‌పై సుప్రీం అభ్యంతరం
ఇప్పటికే వీధిశునకాలు సమస్యగా మారాయని మండిపాటు
న్యూఢిల్లీ: వీధిశునకాలను ఎక్కడపడితే అక్కడ పెంచిపోషిస్తున్న కారణంగా కుక్కలున్న రోడ్లపై చిన్నారులు, వృద్దులు, మహిళలు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి దాపురించిందని సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. వీధి శునకాల కోసం ప్రత్యేకంగా ఆహారకేంద్రాలు తెరవాలంటూ పిటిషన్ దాఖలుచేసిన ఒక వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన తరఫున హాజరైన న్యాయవాదిపై పలు ప్రశ్నలు సంధించింది.
‘‘వీధిశునకాల బాగోగులు పట్టించుకునే ఇలాంటి దయార్థ్ర హృదయుల కోసం కాలనీలోని ప్రతి రోడ్డును, ప్రతి సందును భోజనాల కోసం కేటాయించాలా?. ఆయన ఉండే కాలనీలోని వీధి శునకాలన్నింటికీ ఆయన సొంతింట్లోనే ఆహారం పెట్టొచ్చుగా?. ఎవ్వరూ ఆయనకు అడ్డుచెప్పరు’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జంతువుల జనన నియంత్రణ నిబంధనలు, 2023లో 20వ రూల్ ప్రకారమే తమ ఏరియాలోని వీధిశునకాలకు క్లయింట్ ఆహారం పెడుతుంటే ఆయా కాలనీవాసులు, అపార్ట్‌మెంట్ యజమానులు అడ్డుచెబుతున్నారని, వేధిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. జనం పెద్దగా తిరగని ప్రాంతాల్లో ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటుచేసేలా పురపాలికలను ఆదేశించాలని న్యాయవాది కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది.
‘‘మేమొక మంచి సలహా ఇస్తాం. పిటిషనర్ ఇంట్లోనే ఒక షెల్టర్‌ను తెరవండి. అక్కడే ప్రతి ఒక్క వీధిశునకానికి ఆహార ఏర్పాట్లు చేసుకోండి’’అని కోర్టు సూచించింది. గ్రేటర్ నోయిడాలో ఇలాంటి పాయింట్లు ఉన్నా నోయిడా సిటీలో లేవని న్యాయవాది వాదించడంతో కోర్టు మళ్లీ స్పందించింది. ‘‘మీరొక సైకిల్ తొక్కుతూ ఉదయం పూట అలా వెళ్లిరండి. వీధి శునకాలున్న రోడ్డులో ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది.
‘‘నేను రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్తా. ఎన్నో కుక్కలను చూస్తా’’అని అనడంతో కోర్టు కల్పించుకుని ‘‘ఉదయపు నడకకు వెళ్లే వాళ్లకు వీధిశునకాల బెడద ఎక్కువ. అందులోనూ సైకిల్, ద్విచక్రవాహనాలు నడిపే వాళ్లకు కుక్కల బెడద మరింత ఎక్కువ. అవి వెంట బడి కిందపడి గాయపడేలాచేస్తాయి. వాటి కారణంగా కిందపడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే అంశంలో పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులతో కలిపి ఈ పిటిషన్‌ను తర్వాత విచారిస్తామని కోర్టు తెలిపింది.