ప్చ్‌.. 30 ఏళ్లుగా ఆ సెంటిమెంట్‌! ఆ అంశాలతో కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?

Which Factors Favouring And Challenging Ruling Congress In Rajasthan - Sakshi

రాజస్థాన్‌లో అసెంబ్లీ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో అక్కడ పోలింగ్‌ జరగనుంది. ఇరుపక్షాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా ప్రచారాలను హోరెత్తించాయి. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో ఒకదఫా బీజేపీ, మరోదఫా కాంగ్రెస్‌లు అధికారం చేపడుతూ వచ్చాయి. కానీ, ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్‌ వేయాలని కాంగ్రెస్‌.. ఆ సంప్రదాయామే కొనసాగాలని బీజేపీ కోరుకుంటున్నాయి. కానీ, కాంగ్రెస్‌ అనుహ్యమైన రీతీలో వ్యవహరించింది. అంతర్గత విభేదాలకు చెక్‌ పెట్టి.. ప్రజలకు ఎన్నో రకాల వెల్‌ఫైర్‌ స్కీమ్‌లు అందించి మెజార్టీ ఓట్లను కొల్లగొట్టేలా పావులను కదిపింది. మరి కాంగ్రెస్‌ మళ్లీ అధికారాన్ని దక్కించుకోగలదా? మైనస్‌గా ఉన్న ప్రతికూల అంశాలు పాజిటివ్‌గా మారి కాంగ్రెస్‌కి విజయాన్ని తెచ్చిపెడతాయా? విశ్లేషిస్తే.. 

రాజస్థాన్‌లో మరోసారి అధికారంలో పాగావేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌కు కొన్ని సవాళ్ల తోపాటు అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వాలు మారుతున్న రాజస్థాన్‌లో చరిత్రను తిరిగే రాసేలా.. కాంగ్రెస్‌ శతవిధాల యత్నించింది. కానీ ఆ ఆ పార్టీకి ప్రతికూలాంశాల నడుమ సవాళ్లు ఎదురయ్యాయి. 

ఎగ్జామ్‌ పేపర్‌ లీకేజ్‌..
కాంగ్రెస్‌ నేతృత్వంలోని విద్యామంత్రిగా ఉన్న గోవింద్ సింగ్ దోతస్రా సారథ్యంలో జరిగిన పేపర​ లీకేజ్‌లు, పరీక్షల రద్దు, అరెస్టులు తదితరాలు విద్యావ్యవస్థ పరంగా కాంగ్రెస్‌కి అతి పెద్ద మాయని మచ్చ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పేపర్‌ లీక్‌ కుంభకోణం కాంగ్రెస్‌ రాజకీయ భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ అంశమే కాంగ్రెస్‌కి మైనస్‌ అయ్యి..ప్రజలు అధికారం పట్టకట్టాలా? లేదా అనే మీమాంసంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అంతర్గత విభేదాలు..
కాంగ్రెస్‌లో తరచుగా తెరపైకి అంతర్గత విభేధాలు తారస్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ల మధ్య నువ్వా-నేనా? అనే స్థాయికి వచ్చాయి. ఆఖరికి సొంత పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు సచిన్‌. ఆఖరికి తమ అధికార పార్టీ పాలనే బాగోలేదంటూ సచిన్‌ బయటకు వచ్చి మరీ నిరాహారదీక్ష చేపట్టి అందర్నీ విస్తుపోయాలా చేశారు. చివరికి కాంగ్రోస్‌ అధిష్టానం దిగొచ్చి జోక్యం చేసుకునేంత వరకు అంతర్గత విభేదాలు సద్దుమణగలేదు. ఇది ఒకరంగా ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్‌ పాలన అనే సందేహాలకు తావిచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం.  

అవినీతి, అల్లర్లు, నేరాలు..
ముఖ్యంగా రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవతవకలు పాలనలోని డొల్లతనాన్ని చూపాయి. పారదర్శకతకు తిలోదకాలు వదిలి రాష్ట్రంలో అల్లర్లు చెలరేగేందుకు కారణమైంది. పైగా గహ్లోత్‌ ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైంది కూడా. ఇక మహిళలకు భద్రత లేకపోవడం, విపరితంగా పెరిగిన నేరాలు, నిరుద్యోగం, వ్యవసాయ కష్టాలు తదితరాలు కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఇవే ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల తీవ్ర అసంతృప్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఇక అనుకూలమైన విషయాల వద్దకు వస్తే ఎన్నికలు సమీపిస్తుండగా ఒకరంటే ఒకరికి పడని గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ ఊహించని రీతిలో ఐక్యతను చాటడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక పైలెట్‌ కూడా తమ పార్టీ ఐక్యతను చాటి చెప్పలా ఆయన ప్రవర్తన తీరు తోపాటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఊహకందని రీతిలో కాంగ్రెస్‌ వెల్‌ఫైర్‌ స్కీమ్‌లు, గ్యారంటీలు వంటి హామీలతో రసవత్తరంగా దూసుకొచ్చింది. కాంగ్రెస్‌పై సానుకూల పవనాలు వీచేలా తన తీరుని మార్చి బీజేపీనే విస్తుపోయేలా చేసింది. ఈ గ్యారంటీ గేమ్‌, కాంగ్రెస్‌ వ్యూహం ఎంతవరకు ప్లస్‌ అవుతుందా? వాటిల్లో కాంగ్రెస్‌కి ఎంతవరకు సానూకూల అంశాలు ఉన్నాయి అంటే..

సానూకూలమైన అంశాలు

యునైటెడ్ ఫ్రంట్
అశోక్‌ గెహ్లోత్‌, సచిన్‌ పైలట్‌లు తామెప్పుడూ ఒకటేనని పార్టీని నిలబెట్లుకోవడమే లక్ష్యం అని ప్రకటించారు. అలాగే సచిన్‌ పైలట్‌ కూడా రాజస్తాన్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలోకి  తనను పిలవకపోయినా పట్టించుకోలేదు. గహ్లోత్‌ ఒక్కరే అన్ని తానై పార్టీని నడిపిస్తున్నట్లు ప్రచారం చేసుకున్న సంయమనాన్ని పాటించి సచిన్‌ అందర్నీ ఆకర్షించారు. ఇక వరుసగా రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ఎందుకు గెలవడం లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీకి సూచించారు.

అదే సమయంలో తమ పార్టీ గెలుస్తుందని కూడా ధీమాగా చెప్పి తామంత ఐక్యంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు. పైగా గతంలో చేసిన వ్యాఖ్యల విషయం కూడా రాజకీయ పరంగా వచ్చినవే "క్షమించడం, మరచిపోవడం" అనే మంత్రాలని పాటిస్తున్నానంటూ నాయకులు ఐక్యతకు పీఠం వేశారు. ఇది ఒకరకంగా కాంగ్రెస్‌కి ప్లస్‌ అవ్వొచ్చు. పైగా తన తీరుని మార్చుకుని ప్రజలకు సుపరిపాలన ఇచ్చే దిశగా కాంగ్రెస్‌ తన గత వైభవాన్ని తీసుకొస్తుందనే ఆలోచన ప్రజలకు కలిగించింది. ఓట్లును కొల్లగొట్టేందుకు ఇది మంచి సానుకూలం అంశమే అని చెబుతున్నారు విశ్లేషకులు.

గ్యారంటీల గేమ్‌
అశోక్‌ గహ్లోత్‌ ఓటర్లను ఆకర్షించేలా.. ఏడు గ్యారంటీలు, పాత పెన్షన్‌ స్కీమ్‌, మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకనేలా సుడిగాలిలో రాష్టం అంతటా పర్యటించారు. తన హామీలు ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసే ప్రయత్నాలు కూడా ఓటర్లను ప్రభావితం చేసి కాంగ్రెస్‌కి గెలుపులో కీలకం అవ్వోచని భావిస్తున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్‌ ఓటర్ల నాడికి తగ్గట్టుగా వ్యూహం మార్చి తన ముందున్న సవాళ్లను సానూకూలంగా మార్చుకుంటూ ప్రత్యర్థులనే షాక్‌ గురి చేసింది. ఎలాంటి స్కీమ్‌, హామీలు ప్రజల్లోకి చేరతాయి, ఏ విధంగా పాలనలో మార్పులు చేయాలనే దిశగా అడగులు వేస్తూ గెలుపే లక్ష్యం దూసుకుపోతుంది.


బీజేపీ వ్యూహం ఇలా..
ఇదిలా ఉండగా బీజేపీనేమో కాంగ్రెస్‌ మైనస్‌లను హైలెట్‌ చేస్తూ ‍ప్రజల్లో వెళ్లింది. అలాగే రాజస్థాన్‌లో ఆనవాయితీగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదనే సెంటిమెంట్‌ను బీజేపీ నమ్ముతూ.. విజయావకాశాలపై ధీమాతో ఉంది. పైపెచ్చు.. తాము అధికారంలో ఉండగా రాజస్థాన్‌కి చేసిన నిధుల కేటాయింపు ఓటర్లకు గుర్తుచేస్తూ.. వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. అన్నింటికంటే ముఖ్యంగా.. కాంగ్రెస్‌లోని ఐక్యత లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారంలో దూసుకెళ్లింది. ఈ తరుణంలో.. ఓటర్‌ తీర్పు.. అందునా కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ల నిర్ణయం ఎలా ఉండబోతుందా? అనేది తెలియాలంటే డిసెంబర్‌ 3వ తేదీదాకా వేచి చూడాల్సిందే.  

(చదవండి: కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలన్నీ బౌండరీలు దాటేశాయి! అమిత్‌ షా!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top