నా కారునే ఆపుతావా.. టోల్‌గేట్‌ సిబ్బందిపై ఎంపీ దాడి | Sakshi
Sakshi News home page

నా కారునే ఆపుతావా.. టోల్‌గేట్‌ సిబ్బందిపై ఎంపీ దాడి

Published Sat, Aug 5 2023 3:39 PM

West Bengal: Tmc Mp Assaults Toll Booth Employee For Stop His Car - Sakshi

కోల్‌కతా: తన కారు ఆపాడని కోపంతో ఓ టోల్‌ బూత్‌ సిబ్బందిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ప్రకారం టీఎంసీ ఎంపీ సునీల్ మండల్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. బుర్ద్వాన్‌లోని పల్సిట్‌లో గురువారం రాత్రి ఆయన కారు టోల్‌ గేటు దాటుతుండగా టోల్‌ ఉద్యోగి నిబంధనల ప్రకారం వాహనాన్ని ఆపాడు. 

అయినప్పటికీ డ్రైవర్‌ కారును ఆపలేదు. ట్రాఫిక్‌ కోన్‌ను ఢీకొట్టి ముందుకు నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న టోల్‌ బూత్‌ ఉద్యోగి ఉజ్వల్ సింగ్ ట్రాఫిక్‌ కోన్‌ను పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కారు దిగి వచ్చిన ఎంపీ సునీల్‌ మండల్‌ ఆ ఉద్యోగిపై మండిపడ్డారు. నా కారునే ఆపుతావా అంటూ అతడిపై చేయి చేసుకోవడంతో పాటు తోసేశారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న ఇతర ఉద్యోగులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంపీకి నచ్చజెప్పడంతో ఈ గొడవ సద్ధుమణిగింది.

అయితే ఈ ఘటన మొత్తం టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌ కావడంతో టీఎంసీ ఎంపీ సునీల్‌ మండల్‌స్పందించారు. తాను తొందరలో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు.  సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించడంతోనే తాను చేయి చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగిని భౌతికంగా తోయడం తప్పేనంటూ క్షమాపణలు కూడా చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement