
వైద్య విద్యార్థిని రేప్ ఉదంతంపై
మమత వివాదాస్పద వ్యాఖ్యలు
అంత రాత్రివేళ బయటికొస్తుంటే కాలేజీ సెక్యూరిటీ ఏం చేస్తున్నట్లు?
అయినాసరే బయటకొస్తామంటే
మీ రక్షణ మీరే చూసుకోవాలని హితవు
మెడికల్ విద్యార్థుల భద్రతను ప్రైవేట్ కాలేజీ గాలికొదిలేసిందని ఆరోపణ
దుర్గాపూర్/కోల్‌కతా: పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలో వైద్యవిద్యార్థిని సామూహిక అత్యాచార ఉదంతంలో భద్రతా వైఫల్యాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి వేళ విద్యార్థిని మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
నార్త్‌బెంగాల్ ఏరియాలో ప్రకృతివిపత్తుతో ధ్వంసమైన ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తూ కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించడంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ విఫలమైందని ఆరోపించారు. ‘‘ బాధిత విద్యార్థిని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకుంటోంది. ఈ లెక్కన ఆ కాలేజీలోని విద్యార్థినుల భద్రత, రక్షణ బాధ్యత ఆ కాలేజీదే.
అర్ధరాత్రి 12.30 గంటలకు ఆ అమ్మాయి కాలేజీ నుంచి ఎందుకు బయటకు వచ్చింది? అమ్మాయి అర్ధరాత్రి బయటకు వస్తుంటే కాలేజీ సెక్యూరిటీ విభాగం ఏం చేస్తోంది? జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమని నేను కూడా ఒప్పుకుంటా. కానీ అసలు అమ్మాయి అర్ధరాత్రి బయటకు వెళ్తుంటే కాలేజీ యాజమా న్యం ఏం పట్టించుకుంటున్నట్లు? అర్ధరాత్రి బయ టకు అనుమతించే సంస్కృతిని ప్రైవేట్ కాలేజీని విడనాడాలి. అటవీ ప్రాంతంలోని ఆ కాలేజీ నుంచి అర్ధరాత్రి ఎవరినీ బయటకు అనుమతించకూడదు. అయినాసరే బయటకొ స్తామంటే వాళ్ల రక్షణ బాధ్యత వాళ్లే చూసుకోవాలి.
అది పూర్తిగా అటవీప్రాంతం. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులను తప్పుబట్టడానికి ఏం లేదు. ఎందుకంటే పోలీసులకు సైతం కొన్ని పరిమితులు ఉంటాయి. వ్యక్తులు వ్యక్తిగతంగా రాత్రిళ్లు చేసే షికార్లను పోలీసులు ఎలా ముందే పసిగట్టగలరు?. రాత్రి ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారో పోలీసులకు ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్క ఇంటి ముందు పోలీసులు రక్షణగా నిలబడలేరుకదా?. రాష్ట్రేతర మహిళా విద్యార్థులు తాముండే హాస్టళ్ల నిబంధనలను అతిక్రమించకూడదు. రాత్రివేళ బయటకు వచ్చే సాహసం చేయకండి’’ అని మమత అన్నారు.
బెంగాల్ మీదే ఎందుకు కక్ష ?
‘‘చాలా రాష్ట్రాల్లో ఇలా గ్యాంగ్‌రేప్‌లు జరుగుతున్నాయి. ఒక్క బెంగాల్‌లో జరిగిన ఘటనలనే ఎందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుస్తున్నారు?’’ అని మీడియాను మమత ఎదురు ప్రశ్నించారు. ‘‘ఇలాంటి ఘటనలు పొరుగున ఉన్న బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశాలోనూ జరుగుతున్నాయి. కేసు విచారణ కోసం న్యాయస్థానాలకు వెళ్తున్న బాధితులను యూపీలో మార్గమధ్యంలోనే తగలబెడుతున్నారు. ఒడిశాలో బీచ్‌లలో రేప్ ఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనల్లో అక్కడి ప్రభుత్వాలు ఏపాటి చర్యలు తీసుకున్నాయి. గత ఏడాది ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ ఉదంతంలో మా ప్రభుత్వం నెలలోపే చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కింది కోర్టు ఇప్పటికే మరణశిక్ష సైతం విధించింది’’అని మమత గుర్తుచేశారు.
మండిపడ్డ విపక్షం
దారుణోదంతంపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వాల్సిందిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మమతా బెనర్జీపై విపక్ష బీజేపీ మండిపడింది. ‘‘ బాధితురాలికి అండగా నిలబడకుండా ఆమెనే నేరస్తురాలు అన్నట్లు మమత అత్యంత కర్కశంగా మాట్లాడుతున్నారు. బాధితురాలిని కష్టకాలంలో ఆదుకుని అండగా నిలబడాల్సిందిపోయి ఇలా మాట్లాడుతున్న మమతకు కనీసం పరిపాలించే హక్కు లేదు.
మహిళాలోకానికే మమత మాయని మచ్చ’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఆర్‌జీ కర్ ఉదంతం, సందేశ్‌ఖాలీ ఘటనల తర్వాత రేప్ కేసుల్లో న్యాయం చేయడం మానేసి బాధితురాలినే సీఎం మమత తప్పుబడుతున్నారు’’ అని గౌరవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాత్రిళ్లు అవసరమైనా బయటకు వెళ్లకూడదట. వెళితే ఇలా రేప్‌లను ఎదుర్కోక తప్పదు అన్నట్లు మమత వ్యాఖ్యలున్నాయి’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్, రిమాండ్
గ్యాంగ్‌రేప్ ఘటనలో నిందితులు షేక్ రియాజుద్దీన్, షేక్ ఫిర్దౌస్, అప్పూలను ఆదివారం పోలీసులు అరెస్ట్‌చేశారు. ఘటన వేళ బాధితు రాలి ఫోన్‌ను లాక్కున్న నిందితులు వేరే వ్యక్తికి ఫోన్ చేశారు. అలా బాధితురాలి ఫోన్ కాల్‌డేటా విశ్లేషణ ద్వారా నిందితుల జాడ కనిపెట్టారు. బాధితురాలి స్నేహితురాలి పాత్ర పైనా పోలీసు లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసా గుతోంది. ముగ్గురు నిందితులను పోలీసులు ఆదివారం దుర్గాపూర్ సబ్ డివిజినల్ జ్యుడీషి యల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీళ్లను 10 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆయన ఆదేశాలి చ్చారు. రేప్ ఘటనలో పరోక్ష ప్రమేయం ఉండొచ్చన్న అనుమానంతో మరో వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.