
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు కొనసాగుతాయని, సోమవారం నాడు ఢిల్లీలో భారీ ప్రదర్శన చేపడతామని రైతు సంఘాలు తెలిపాయి. ఈనెల 12వ తేదీ వరకు జైపూర్-ఢిల్లీ హైవేపై ఆందోళన చేస్తామని, ఈనెల 12న దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద ఆందోళనలు చేపడతామని చెప్పాయి. బుధవారం రైతు సంఘాలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నాయి. చట్ట సవరణలకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా చెప్పారని, రైతులకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారని.. కానీ, ఎలా ప్రయోజనమో చెప్పడం లేదని అన్నారు. చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ( రైతు ఆందోళనలు: కేంద్రం ప్రతిపాదనలు)
కాగా, కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా మంగళవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి రైతులతో చర్చలు జరిపినప్పటికి ఫలితం దక్కలేదు.